ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరంలో సోమవారం నాడు టీడీపీ శ్రేణులు , ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యాలయంపై వంశీ వర్గీయులు దాడికి దిగారు.
విజయవాడ: గన్నవరంలో సోమవారంనాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయ ఆవరణలో పార్క్ చేసిన వాహనాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి దిగారు. ఓ కారుకు నిప్పు పెట్టారు. టీడీపీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.
మూడు రోజులుగా గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది .మూడు రోజుల క్రితం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అగ్రనేతలపై విమర్శలు చేశారు. ఈ విమర్శలకు టీడీపీ నేతలు కౌంటరిచ్చారు. అంతేకాదు వల్లభనేని వంశీకి వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వార్నింగ్ ఇచ్చిన నేతల ఇళ్లకు వంశీ మనుషులు వచ్చి బెదిరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
undefined
. ఈ విషయమై వంశీ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు ఇవాళ ర్యాలీగా బయలుదేరారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వంశీ అనుచరులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు. టీడీపీ కార్యాలయంలోని ఆవరణలో పార్క్ చేసిన కారుకు నిప్పు పెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.
టీడీపీ కార్యాలయంలో పార్క్ చేసిన వాహనానికి నిప్పు పెట్టడంతో టీడీపీ శ్రేణులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు కూడా రాకుండా వల్లభనేని వంశీ వర్గీయులు అడ్డుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. పోలీసులు దగ్గరుండి తమ పార్టీ కార్యాలయంపై దాడి చేయించారని టీడీపీ శ్రేణులు పోలీసులపై మండిపడ్డారు. ఈ విషయమై టీడీపీ శ్రేణులు డీఎస్పీని నిలదీశారు. పార్టీ కార్యాలయంపై వంశీ వర్గీయుల దాడిని నిరసిస్తూ విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు బైఠాయించి నిరసనకు దిగారు. నిరసనకు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు.
అంతకుముందు టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ రాళ్ల దాడిలో సీఐకి గాయాలయ్యాయి. సోమవారంనాడు రాత్రి టీడీపీ నేత చిన్నా కారుకు వంశీ వర్గీయులు నిప్పు పెట్టారు. దీంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళనకు దిగారు.