బాపట్ల ఎంపీ సురేష్‌పై దాడికి మహిళల యత్నం, జేఎసీ బస్సును వెంటాడిన యువకులు

By narsimha lodeFirst Published Feb 24, 2020, 7:39 AM IST
Highlights

అమరావతి పరిసర గ్రామాల్లో ఆదివారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఎంపీ సురేష్ పై మహిళ జేఎసీ నేతలు దాడికి యత్నించారని వైసీపీ ఆరోపిస్తోంది. లేమల్లేలో మహిళల జేఎసీ బస్సును వైసీపీ వర్గీయులు అడ్డుకొన్నారు.


అమరావతి: బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై అమరావతి మహిళా జేఎసీ సభ్యులు అడ్డుకొన్నారు.ఎంపీ సురేష్ పై మహిళా జేఎసీ సభ్యులు ఎంపీపై దాడి చేసేందుకు ప్రయత్నించారని  సురేష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మహిళా జేఎసీ సభ్యుల బస్సును  లేమల్లే గ్రామం వద్ద సురేష్ వర్గీయులు అడ్డుకొన్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అమరావతి అమరలింగేశ్వరస్వామి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఎంపీ సురేష్ తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఎంపీ నందిగం సురేష్ జై అమరావతి అనేందుకు నిరాకరించడంతో అమరావతి మహిళా జేఎసీ సభ్యులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఎంపీ చొక్కాను పట్టుకొని దాడి చేసేందుకు జేఎసీ నేతలు ప్రయత్నించినట్టుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జేఎసీ నేతల దాడిలో ఎంపీ సురేష్ గన్ మెన్ గాయపడినట్టుగా వైసీపీనేతలు చెప్పారు. 

also read:అమరావతిలో రథోత్సవం: రాజధాని ప్రజల ఆందోళన, రైతును ఢీకొన్న వైసీపీ ఎంపీ కారు


ఎంపీ సురేష్‌ కారు ఎక్కకుండా మహిళా జేఎసీ సభ్యులు అడ్డుకొన్నారు. ఈ క్రమంలో ఎంపీ వర్గీయులు జేఎసీ నేతలు నెట్టివేసి ఎంపీ కారును అక్కడి నుండి సురక్షితంగా పంపించారు. మహిళా జేఎసీ సభ్యుల బస్సు తాడికొండ మండలం లేమల్లే గ్రామానికి చేరుకోగానే ఆ గ్రామానికి చెందిన వైసీపీ వర్గీయులు బస్సును అడ్డుకొన్నారు.

బస్సులో నుండి ఎవరూ కిందకు దిగకుండా బస్సు డోర్ వద్ద ఖాళీ డ్రమ్ములను పెట్టి అడ్డు నిలిచారు. బస్సులో మహిళా జేఎసీ నేతలపై లేమల్లేకు చెందిన వైసీపీ వర్గీయులు కారం చల్లారని ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో  మహిళా జేఎసీ నాయకురాలు తమకు రక్షణగా రావాలని వాట్సాప్ లో అమరావతికి చెందిన గ్రామాల జేఎసీ నేతలకు సమాచారం పంపింది.

లేమల్లే గ్రామంలో సుమారు రెండు గంటలకు పైగా బస్సును వైసీపీ వర్గీయులు అడ్డుకొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు వైసీపీ వర్గీయులను బస్సుకు అడ్డంగా తొలగించి బస్సును అక్కడి నుండి తీసుకెళ్లారు. బస్సును కొందరు ట్రాక్టర్లతో వెంబడించారు.

బస్సును అమరావతి వైపు పోలీసులు తీసుకెళ్లారు. అప్పటికే పోలీస్ స్టేషన్ వద్ద భారీగా జేఎసీ నేతలు చేరుకొన్నారు. స్టేషన్ ముందు బైఠాయించిన నిరసనకు దిగారు. లేమల్లే గ్రామంలో ఎంపీ వర్గీయులు తమ బస్సుకు అడ్డుగా నిల్చుకొని కళ్లలో కారం కొట్టారని మహిళా జేఎసీ నేతలు ఆరోపించారు. ఎంపీ సురేష్ వర్గీయులు తమను దుర్బాషలాడారని చెప్పారు.రథోత్సవం కార్యక్రమానికి హజరయ్యేందుకు వెళ్తున్న ఎంపీ సురేష్ కారు డీకొని తాడికొండ హనుమంతరావు అనే జేఎసీ నేత కాలుకు గాయమైంది. 

click me!