ప్రముఖ తెలుగు రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ఇక లేరు

By telugu team  |  First Published Jun 28, 2019, 8:04 AM IST

తన మార్గం అనే కథల సంపుటికి ఛాయాదేవి 2005లో సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం  మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వర రావు సతీమణి ఛాయాదేవి. ఆమె మామ అబ్బూరి రామకృష్ణా రావు తొలుత భావ కవిత్వం, ఆ తర్వాత అభ్యుదయ కవిత్వం రాశారు.


హైదరాబాద్: ప్రముఖ తెలుగు రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ఇక లేరు. ఆమె శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో 1933 అక్టోబర్ 13వ తేదీన జన్మించారు. 

తన మార్గం అనే కథల సంపుటికి ఛాయాదేవి 2005లో సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం  మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వర రావు సతీమణి ఛాయాదేవి. ఆమె మామ అబ్బూరి రామకృష్ణా రావు తొలుత భావ కవిత్వం, ఆ తర్వాత అభ్యుదయ కవిత్వం రాశారు.

Latest Videos

undefined

అబ్బూరి ఛాయదేవి తెలుగు సాహిత్య విమర్శ కూడా చేశారు. స్త్రీవాద రచయిత్రిగా ఆమె ప్రసిద్ధి పొందారు. ఆమె కథలు ఆంగ్ల భాషలోకి మాత్రమే కాకుండా పలు ఇతర భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. 1960 దశకంలో ఛాయాదేవి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైబ్రేరియన్ గా పనిచేశారు. 

పిల్లల కోసం ఛాయాదేవి అనగనగా... అనే జానపద కథల సంపుటిని వెలువరించారు. 1991లో అబ్బూరి ఛాయాదేవి కథలు పేరుతో సంకలనం వచ్చింది. 1993లో మృత్యుంజయ అనే దీర్ఘ కథ రాశారు. ఆమె కథల సంపుటి బొన్సాయ్ కథలు సాహిత్య పాఠకుల మన్ననలు పొందాయి.

ఛాయదేవి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురితమైంది.

ఛాయాదేవి 2003లో వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారం పొందారు. 1996లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు వచ్చింది. ఆమె మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటు. ఆమె మరణవార్త తెలుగు సాహిత్య లోకాన్ని విషాద సముద్రంలో ముంచింది. 

click me!