మాధవ్ వీడియోని ఆ ల్యాబ్‌లో టెస్ట్ చేయండి.. జాతీయ మహిళా కమీషన్‌కు వంగలపూడి అనిత లేఖ

By Siva KodatiFirst Published Aug 11, 2022, 8:09 PM IST
Highlights

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోని జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయాలని కోరారు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ మేరకు గురువారం ఆమె జాతీయ మహిళా కమీషన్‌కు లేఖ రాశారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (gorantla madhav) వీడియో వ్యవహారంపై జాతీయ మహిళా కమీషన్‌కు లేఖ రాశారు టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత. వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలపై ఇంత అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీపై, ఆయనకు సహకరిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనిత లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో మహిళలు అభద్రతా భావంలోకి నెట్టబడ్డారని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. 

జూన్, 2019 నుంచి నేటి వరకు దాదాపు 777 నేరాలు-ఘోరాలు మహిళలపై జరిగాయని.. మహిళలపై నేరాలు 2020లో 14,603 ఉంటే 2021లో 17,736కి పెరిగాయని ఆమె తెలిపారు. అంటే 21.45% పెరిగిపోయాయని అనిత ఎద్దేవా చేశారు. మహిళలపై దాడులు చూస్తుంటే నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు.     అయినా దిశ చట్టం పేరుతో మహిళలను, సభ్య సమాజాన్ని మభ్యపెట్టేలా జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంలో దిశ చట్టమే లేదని.. మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందన్నారు. 

Also Read:గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో ఒరిజినల్ కాదు: అనంతపురం ఎస్పీ ఫకీరప్ఫ

వైసీపీ నాయకులే స్వయంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, బెదిరింపులకు దిగారని అనిత ఆరోపించారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనైతిక కార్యకలాపాల వీడియోనే ఇందుకు నిదర్శనమన్నారు. సేవ చేసేందుకు ప్రజలు ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే వైసీపీ నాయకులు మాత్రం అనైతికమైన జుగుప్సకరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై సరైన విచారణ గానీ, ఫోరెన్సిక్ టెస్ట్ గానీ చేయకుండా ఎంపీకి క్లీన్ చిట్ ఇచ్చారని అనిత ఆరోపించారు. 

అనంతపురం ఎస్పీ ఫకీరప్ప సరైన విచారణ చేయకుండానే వీడియో మార్పింగ్ చేశారని చెప్పారని ఆమె దుయ్యబట్టారు. మహిళల పట్ల వైసీపీ నేతల అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకే కొంతమంది పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనిత ఆరోపించారు. ఏపీ మహిళలపై జరుగుతున్న నేరాలు-ఘోరాలు, వీటిలో అధికార వైసీపీ నేతల పాత్ర, నేతలకు సహకరిస్తున్న కొంతమంది పోలీసులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కమీషన్ తీసుకునే సత్వర చర్యలు మాత్రమే ఏపీ మహిళల భద్రతకు భరోసా కల్పిస్తాయన్నారు. 

కాగా.. రెండ్రోజుల క్రితం వంగలపూడి అనిత మీడియా సమావేశంలో వుండగానే గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఓ వైసీపీ నేత ఆమెను బెదిరించాడని ఆయన మండిపడ్డారు. ఎంపీ చేసిన పనిని కప్పిపుచ్చడానికి వైసీపీ పెద్దలు తీవ్రంగా శ్రమిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఒక మహిళా నేతనే ఫోన్ చేసి బెదిరిస్తుంటే.. సామాన్య మహిళల పరిస్ధితి ఏంటనీ టీడీపీ అధినేత ప్రశ్నించారు. 

గోరంట్ల న్యూడ్ వీడియో, మహిళలకు కరువవుతున్న రక్షణ, పోలీస్, రాజకీయ నిర్బంధాలు, వేధింపులపై చర్చించడానికి నేడు ఏపీ మహిళ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత (vangalapudi anitha) పాల్గొన్నారు. భేటీ జరుగుతుండగా అనితకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అనిత.. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి సంభాషణ అందరికీ వినిపించారు. మీడియా ముందే అతనితో మాట్లాడారు. 

ఫోన్ చేసిన వ్యక్తి.. ఎంపీ గోరంట్ల మాధవ్‌  వ్యవహారంపై అతిగా స్పందించవద్దని అనితను హెచ్చరించాడు. దర్యాప్తు జరుగుతుండగా ఎందుకు అనవసరమైన చర్చ అని ప్రశ్నించాడు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడితే బాధ అనిపిస్తుందని చెప్పాడు.  ఇలాంటివి ఎన్నో జరుగుతుంటే కేవలం మాధవ్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించాడు. ఈ విషయాన్ని దుమ్ము లేపద్దని అన్నారు. తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృ‌ష్ణా రెడ్డి చెప్పారని అన్నారు. 
 

click me!