
TDP Twitter Hacked: తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. టీడీపీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు వివిధ రకాల పోస్టులు పెట్టారు. శుక్రవారం రాత్రి టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్టుగా తెలుస్తోంది. ట్విట్టర్ అకౌంట్‌ను ఆధీనంలోకి తీసుకున్న హ్యకర్లు.. స్పేస్ ఎక్స్ , ఎలన్ మస్క్‌లతో కూడిన ట్వీట్స్ చేశారు. ఇది చూసిన తెలుగు తమ్ముళ్లు షాక్ తిన్నారు. దీంతో వెంటనే స్పందించిన టీడీపీ ఐటీ విభాగం ఖాతాను పునరుద్దించే పనిలో పడింది.
ఇక, టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలిపిన నారా లోకేష్.. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. మరోవైపు ప్రస్తుతం ఏపీలో ఓవైపు పెగాసస్ వ్యవహారంపై రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం చర్చనీయాంశమైంది.