
హైదరాబాద్: ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. గచ్చిబౌలీ పోలీసు స్టేషన్‌లో తన పై నమోదైన కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
రఘురామకృష్ణరాజు ఇంటి దగ్గర విధుల్లో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పై దాడి చేశారంటూ గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎంపీ రఘురామతోపాటు ఆయన కొడుకు భరత్ పైనా కేసు ఫైల్ అయింది. దీంతో ఈ కేసు కొట్టేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ విచారణలో పోలీసులు బలంగా వాదించారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో బంధించి మరీ కొట్టారని అన్నారు. అంతే కాదు, ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు ఇప్పుడు కీలక దశ లో ఉన్నదని కోర్టుకు వివరించారు. పోలీసులు వాదనల తో హైకోర్టు ఏకీభవించింది. రఘురామ వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది.