జగన్ ఇలాకాలో రేవంత్ రెడ్డి పాగా... 

By Arun Kumar P  |  First Published Jul 9, 2024, 8:30 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా వున్నారనే ప్రచారానికి బలం చేకూర్చేలా రేవంత్ కామెంట్స్ వున్నాయి. ఇంతకు తెలంగాణ సీఎం ఏమన్నారంటే.... 


Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అగ్గి రాజేసారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి... ఇందులో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి అపూర్వ విజయం సాధించింది. వైసిపి అత్యంత ఘోరంగా ఓడిపోయింది... అసెంబ్లీలో 151 సీట్ల నుండి 11 సీట్లకు, లోక్ సభలో 22 నుండి 4 సీట్లకు ఆ పార్టీ బలం పడిపోయింది. 164 అసెంబ్లీ, 21 లోక్ సభ సీట్లతో అఖండ విజయాన్ని సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అధికార పగ్గాలు చేతులుమారి ఇప్పుడిప్పుడే పాలన షురూ అయ్యింది. 

ఇలా ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక ఎన్నికల హడావిడి ముగిసినట్లే అని రాజకీయ పక్షాలే కాదు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇలాటి సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ బాంబ్ పేల్చారు. వైసిపి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప లోక్ సభకు ఉపఎన్నికలు రావచ్చనే మాట వినిపిస్తోందని అన్నారు. అదే నిజమైతే కడప పౌరుషాన్ని ఢిల్లీకి చాటే అవకాశం వచ్చినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ ఉపఎన్నికల్లో మళ్లీ వైఎస్ షర్మిల పోటీ చేస్తారని... అప్పుడు ఇక్కడే మకాం వేసి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తానంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

Latest Videos

కడప లోక్ సభకు ఉపఎన్నిక... నిజమెంత..? 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో వైసిపికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇప్పటికే వైసిపికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడును కోరారు... కానీ అందుకాయన అంగీకరించలేదు. దీంతో అసెంబ్లీకి వెళితే అవమానాలు తప్పవు కాబట్టి ఈ ఐదేళ్లు అటువైపు కన్నెత్తి చూడకూడదనేది వైఎస్ జగన్ ఆలోచనగా తెలుస్తోంది. అందువల్లే కడప లోక్ సభ ఉపఎన్నికలు తెరపైకి వచ్చాయి. 

పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప లోక్ సభకు పోటీ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం కడప ఎంపీగా వున్న సోదరుడు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి పులివెందుల బరిలో నిలపాలని భావిస్తున్నారట జగన్. ఇలా పరస్పరం సీట్లు మార్చుకోడానికి ఇద్దరూ సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఇదంతా ప్రచారమే... కానీ తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలతో కడప ఉపఎన్నికలకు బలం చేకూరింది. 

రేవంత్ అన్నట్లు నిజంగానే కడప లోక్ సభకు ఉపఎన్నిక వస్తే రసవత్తరంగా వుంటుంది. ఈ ఉపఎన్నికను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకుంటాయి. జగన్ కే కాదు అధికార టిడిపి, జనసేన, బిజెపి కూటమికి ఈ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకమే. తామేమీ తక్కువకాదు... కడప లోక్ సభకు ఉపఎన్నిక వస్తే షర్మిల మళ్లీ బరిలో వుంటారని... తానే స్వయంగా ప్రచారం చేస్తానని తెలంగాణ సీఎం చెబుతున్నారు. అంటే కడప ఉపఎన్నిక వస్తే ఏపీలో పొలిటికల్ హీట్ మరోసారి పోటెత్తనుందన్న మాట. 

వైస్సార్ జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి స్పీచ్ : 

జూలై 8న దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం. ఆయన 75వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని సికె కన్వెన్షన్ సెంటర్ లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో  వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు... అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీ పిసిసి చీప్ వైఎస్ షర్మిలతో పాటు ఏపీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ ఈ జయంతి వేడుకల్లో పాల్గోన్నారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనందరికి దూరమై 15 ఏళ్లు పూర్తయ్యిందని గుర్తుచేసారు. ఇలా ఇంకెంతకాలం గడిచినా వైఎస్సార్ ను మనందరం గుర్తుపెట్టుకుంటామని అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారన్నారు. కేవలం ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ఆయనకు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారన్నారు. వైఎస్సార్ తనకు ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయన్నారు రేవంత్. 

తాను మొదటిసారిగా శాసనమండలికి వెళ్లినపుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టిని ఆకర్షించేందుకు తెగ ప్రయత్నించేవాడినని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. ఇందుకోసం ముందుగానే ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యేవాడినని... తన ప్రశ్నలకు వైఎస్సార్ సమాధానాలు చెప్పేవారని అన్నారు.  కొత్తవారిని ప్రోత్సహిస్తే నాయకత్వం బలపడుతుందని వైఎస్ నమ్మేవారని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులను గౌరవించడం వైఎస్ఆర్ నుంచి నేర్చుకోవాలని రేవంత్ అన్నారు. 

1999లో వైఎస్ పోషించిన పాత్రను ఇప్పుడు షర్మిల పోషిస్తున్నారని రేవంత్ అన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది... ఎలాగంటే బి అంటే బాబు, జె అంటే జగన్, పి అంటే పవన్... మొత్తం కలిపితే బిజెపియే కదా అంటూ చమత్కరించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు.. అంతా పాలకపక్షమే... బాబు, జగన్,  పవన్ అందరూ మోదీ పక్షమేనని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే నాయకురాలు కేవలం షర్మిల మాత్రమేనని అన్నారు. 

2029లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని రేవంత్ జోస్యం చెప్పారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వారే ఆయన నిజమైన వారసులు... కానీ ఆయన పేరుతో రాజకీయ వ్యాపారాలు చేసేవాళ్లు కాదంటూ జగన్ కు చురకలు అంటించారు. వైఎస్సార్ ఆశయాలు కొనసాగించేందుకు షర్మిల ముళ్ల బాటను ఎంచుకున్నారని అన్నారు. షర్మిలకు మేమంతా అండగా నిలబడతామని చెప్పేందుకే మంత్రివర్గ సభ్యులతో కలిసి ఈ వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి వచ్చినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
 

click me!