జగన్‌ను నాన్న గెలిపించాడు.. అమ్మ ఓడించింది..!!

By Arun Kumar P  |  First Published Jul 8, 2024, 6:33 PM IST

వైఎస్ జగన్ ఓటమికి ఆయన సొంతతల్లి విజయమ్మ కూడా ఓ కారణమని వైసిపి నాయకులు అంటున్నారు. తండ్రి వైఎస్సార్ ఆయనను గెలిపిస్తే... తల్లి ఓడించిందని ఆరోపిస్తున్నారు. 


YS Jaganmohan Reddy : ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరూ ఊహించని విధంగా ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వైసిపి, కూటమి మధ్య హోరాహెరీ పోరు వుంటుందనుకుంటే ఏకపక్షంగా ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి భారీ విజయాన్ని సాధించింది... ఒంటరిగా పోటీచేసిన వైసిపి కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.   అయితే గతంలో 151 అసెంబ్లీ స్థానాలు గెలిచిన వైసిపి ఈసారి 11 సీట్లకు పడిపోవడమంటే మామూలు విషయం కాదు. కర్ణుడి చావులాగే వైసిపి పరాజయానికి సవాలక్ష కారణాలున్నాయి... కానీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తల్లి విజయమ్మ కూడా ఈ ఓటమికి కారణమనే వాదన ఆసక్తికంగా మారింది. . 

తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ది పొందారన్న విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు వైఎస్సార్... ఈ సమయంలో అనేక ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లో గొప్పపేరు తెచ్చుకున్నారు. కానీ సీఎంగా వుండగానే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. తండ్రి మరణంతో రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో వైఎస్ జగన్ కాంగ్రెస్ లోంచి బయటకు వచ్చి సొంతంగా వైఎస్సార్ సిపి పార్టీ పెట్టారు... రాష్ట్ర విభజన తర్వాత వైసిపి కేవలం ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితం అయ్యింది. 

Latest Videos

ప్రజల్లో తన తండ్రి వైఎస్సార్ కు వున్న మంచిపేరు వైఎస్ జగన్ కు కలిసివచ్చింది. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే సమర్దన తనకు వుందని జగన్ అందరినీ నమ్మించగలిగాడు. దీంతో వైఎస్సార్ ను అభిమానించే నాయకులు, కార్యకర్తలంతా ఆయన వెంట నడిచారు. ప్రజలు కూడా ఆయనవైపు మళ్ళారు. దీంతో 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ బంపర్ మెజారిటీతో గెలుపొందారు... వైసిపికి 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు వచ్చాయి. 

ఇలా తండ్రి వైఎస్సార్ వారసుడిగా ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్ ను ప్రజలు ఆకాశానికి ఎత్తారు. కానీ అందివచ్చిన అవకాశాన్ని వైస్ జగన్ చేజేతులా నాశనం చేసుకున్నారు. ఆ ఫలితమే 2024 ఎన్నికలు. 2019  లో వైసిపి ఎంత భారీ మెజారిటీతో గెలిచిందో 2024  అంతటి ఘోర ఓటమిని చవిచూసింది. అయితే వైసిపి గెలుపుకు తమ అధినేత వైఎస్ జగన్ తండ్రి వైఎస్సార్ కారణమైతే... తాజా ఓటమికి ఆయన తల్లి విజయమ్మ కారణమని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. 

వైసిపి ఓటమికి విజయమ్మ ఎలా కారణమంటే : 
 
వైసిపి అధికారంలో వుండగానే వైఎస్ కుటుంబసభ్యులు జగన్ కు దూరమయ్యాయి. వ్యక్తిగత కారణాలతో సోదరుడికి దూరమైన షర్మిల సరిగ్గా ఎన్నికల వేళ ప్రత్యర్థిగా మారారు. కొంతకాలం తెలంగాణ రాజకీయాల్లో పనిచేసిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. ఇది జగన్ కు పెద్ద ఎదురుదెబ్బ... సొంత చెల్లే ఆయనకు ఎదురుతిరగడంతో ప్రజల్లో ఓ రకమైన అనుమానం మొదలయ్యింది. షర్మిల కూడా సీరియస్ గానే వైసిపికి, సోదరుడు జగన్ ను ఓడించేందుకు ప్రయత్నించారు. 

అయితే వైఎస్ విజయమ్మ ఎప్పుడయితే తన కూతురుకు షర్మిలకు మద్దతుగా నిలిచారో జగన్ పని అయిపోయింది.  కడప లోక్ సభకు పోటీచేసిన కూతురు షర్మిలకు సరిగ్గా పోలింగ్ ముందు మద్దతు ప్రకటించారు విజయమ్మ. దీంతో సొంత చెల్లే కాదు కన్నతల్లి కూడా జగన్ ను నమ్మడంలేదని ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇది చిన్న విషయంలాగే కనిపించినా వైసిపికి చాలా పెద్ద డ్యామేజ్ చేసిందని వైసిపి నాయకులు చెబుతున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటివారు బహిరంగంగానే వైసిపి ఓటమికి విజయమ్మే కారణమని అంటున్నారు. 

ఎన్నికల ప్రచారం వేళ వైఎస్ విజయమ్మ కనీసం ఒక్కసారయినా జగన్ తో కనిపించి వుంటే పరిస్థితి వేరేలా వుండేదని వైసిపి నాయకులు భావన. ఆమె వైసిపికి ప్రచారం చేసివుంటే వైఎస్ కుటుంబమంతా జగన్ తో వున్నారనే సందేశం ప్రజల్లోకి వెళ్లివుండేదని అంటున్నారు. కానీ విజయమ్మ మాత్రం కొడుకు రాజకీయ భవిష్యత్ ను నాశనం చేస్తూ అమెరికా వెళ్లిపోయారని... అక్కడితో ఆగకుండా షర్మిలకు మద్దతు ప్రకటించారని మండిపడుతున్నారు. తండ్రి వైఎస్సార్ జగన్ గెలిపించి సీఎం పీఠంపై కూర్చోబెడితే... తల్లి విజయమ్మ మాత్రం కొడుకును ఓడించి గద్దె దింపిందని వైసిపి నాయకులు ఉక్రోశంతో చెబుతున్న మాట. 

వైఎస్ కుటుంబ కలహాలూ జగన్ ఓటమికి కారణమే :

వైఎస్ కుటుంబ తగాదాలు కూడా జగన్ కొంపముంచాయి. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య... ఇందులో సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర జగన్ మెడకు చుట్టుకున్నాయి. బాబాయ్ ని చంపిన హంతకుడిని జగన్ కాపాడుతున్నారనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి ప్రతిపక్షాలు. అంతేకాదు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడంటే ఈ హత్యలో జగన్ పాత్ర కూడా వుండివుంటుందనే అనుమానాలు రేకెత్తించారు. జగన్ భార్య భారతి కూడా వివేకా హత్యతో సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవన్నీ వైసిపిని డ్యామేజ్ చేసాయి. 

ఇక వివేకా భార్య సుగుణమ్మ, కూతురు సునీత న్యాయపోరాటం వైస్ జగన్ విజయావకాశాలను మరింత దెబ్బతీసాయి. సొంత కుటుంబసభ్యులకు న్యాయం చేయలేనివాడు ప్రజలకేం న్యాయం చేస్తాడని ప్రత్యర్థులు ప్రచారం చేసారు. ఇక వివేకా భార్యాకూతురు కూడా వైఎస్ జగన్ కు ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. ఇలా వైసిపి ఓటమిలో వైఎస్ కుటుంబానికి పాత్ర వుంది. 

ఇక వైఎస్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి తీరుకూడా జగన్ ను దెబ్బతీసిందనే ప్రచారమూ జరుగుతోంది. సుబ్బారెడ్డి టిటిడి ఛైర్మన్ గా వుండగానే తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయని... ఇది వైసిపి ఓటమికి కారణమయ్యిందట. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి కూడా వైఎస్ జగన్ కొంపముంచిన వారిలో ఒకరని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 


 

click me!