
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజవకర్గం టీఆర్ఎస్‌లో మరోసారి వర్గ విబేధాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మీర్‌పేట్‌ను సబితా ఇంద్రా రెడ్డి నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మీర్‌పేట్‌ను నాశనం చేస్తుంటే.. చూస్తూ ఊరుకోనని చెప్పారు. మీర్పేట మంత్రాల చెరువును తీగల కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. మంత్రి సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. చెరువులు, పాఠశాల స్థలాలను వదలడం లేదని విమర్శించారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచెయ్యలేదన్నారు.
నియోజకవర్గంలో అభివృద్దిని మంత్రి సబిత గాలికొదిలేశారని తీగల కృష్ణారెడ్డి ఆరోపించారు. మీర్‌పేట కోసం అమరణ నిరహార దీక్ష చేస్తానని చెప్పారు. తమ పార్టీ నుంచి సబితా ఇంద్రా రెడ్డి గెలవలేదని గుర్తుచేశారు. మంత్రి సబిత వైఖరిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడనని చెప్పారు. ఇక, గత కొంతకాలంగా సబితా ఇంద్రారెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న తీగల కృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇక, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికల్లో విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో సబిత ఆధిపత్యం పెరిగిపోయిందని తీగల కృష్ణారెడ్డి భావిస్తున్నారు. మహేశ్వరం టీఆర్ఎస్ కూడా రెండు వర్గాలు చిలీపోయింది. తీగల కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనడం తగ్గించేశారు.
ఈ క్రమంలోనే తీగల పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ప్రగతి భవన్ నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆయన ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని చెబుతారు. అయితే ఈ క్రమంలోనే ఆయన తన కోడలు అనిత రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్ పదవి వచ్చేలా చేసుకున్నారు. అయితే తీగల మాత్రం తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, గత కొంతకాలంగా మహేశ్వరం నియోజవర్గం టీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఇబ్బందికరంగా మారుతున్నయి. కొన్ని నెలల క్రితం నియోజకవర్గం పరిధిలోని తుక్కగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. రెండు రోజుల క్రితం టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన బడంగ్ పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా తీగల కృష్ణారెడ్డి.. మంత్రి సబితా ఇంద్రా రెడ్డిపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.