
కడప: మహిళలు, చిన్నారులపై వరుసగా చోటుచేసుకుంటున్న అఘాయిత్యాలు ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం సృష్టిస్తున్నాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై, రేపల్లె రైల్వేస్టేషన్లో దళిత గర్భిణి గ్యాంగ్ రేప్, తుమ్మపూడిలో వివాహిత కోరిక తీర్చడానికి అంగీకరించలేదని మహిళ దారుణ హత్య, అనకాపల్లిలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఇలా ఏపీలో ప్రతిరోజూ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో, సొంత నియోజవర్గం పులివెందులలో ఓ చిన్నారిపై టీచర్ కీచకపర్వం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... కడప జిల్లాలోని పులివెందుల మున్సిపాలిటీలోని ఓ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శివశంకర్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. స్కూళ్లో చదువుకునే విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఇతడు బుద్దితక్కువ పనిచేసాడు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చేలా చదువుచెప్పే విద్యార్థినిపై కన్నేసి అత్యంత నీచంగా వ్యవహరించి అడ్డంగా బుక్కయ్యాడు.
కొన్ని రోజులుగా శివశంకర్ మూడవ తరగతి విద్యార్థినితో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరూ లేని సమయంలో గదిలోకి పిలుచుకుని చిన్నారితో వెలికిచేష్టలు చేసేవాడు. ఈ విషయం ఎవరికయినా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. ఇలా టీచర్ వికృత చేష్టలతో చిన్నారి స్కూల్ కి వెళ్లడానికి భయడిపోయింది. తల్లిదండ్రులకు తనతో టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
పులివెందుల పోలీసులు సదరు కీచక టీచర్ శివశంకర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు వివిద సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారితో నీచంగా ప్రవర్తించిన టీచర్ ను కఠినంగా శిక్షించాలని పులివెందుల వాసులు కోరుతున్నారు.
ఇదిలావుంటే రెండురోజుల క్రితం అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం, శ్రీసత్యసాయి జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి రాష్ట్రంలో కలకలం రేపాయి. నర్సీపట్నం మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లపై వారి ఇంటిపక్క యువకుడే కన్నేసాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన యువకుడు అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి 2 గంటల సమయలో బాలికలిద్దరూ బహిర్భూమికి వెళ్ళగా ఇదే అదునుగా రహస్యంగా వారిని అనుసరించిన యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరిలో చిన్నదైన ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇక శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన యువకుడి తోటలో యువతి తీవ్ర గాయాలతో మృతిచెందడం కలకలం రేపింది. అయితే యువతిది ఆత్మహత్య కాదని... గ్యాంగ్ రేప్ చేసి చంపారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. గోరంట్లకు చెందిన యువతి తిరుపతిలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. ఈమె గోర్లంట్లలో అద్దెకుండే ఇంటికి సమీపంలో సాదిక్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ గురించి తెలిసి యువతి తల్లిదండ్రులు ఇంటిని ఖాళీచేసి మరో చోట అద్దెకున్నారు. అయినప్పటికి యువతితో సాదిక్ ప్రేమాయణం కొనసాగుతూనే వుంది.
ఏమయ్యిందో తెలీదుగానీ తిరుపతిలో వుండాల్సిన యువతి ప్రియుడు సాదిక్ ఫామ్ హౌస్ లో శవంగా తేలింది. శరీరంపై గాయాలతో ఓ షెడ్ లో ఉరేసుకుని యువతి మృతదేహం లభించింది. యువతిని తిరుపతినుండి తీసుకువచ్చి సాదిక్ తో పాటు అతడి స్నేహితులు సామూహిక అత్యాచారం జరిపి హత్యచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి చనిపోయాక ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అయితే పోలీసులు, పోస్టుమార్టం చేసిన వైద్యులు మాత్రం యువతిపై అత్యాచారం జరగలేదని చెబుతున్నారు.