
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసింది. జవహర్ రెడ్డి ప్రస్తుతం టీటీడీ ఈవోగా, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీటీడీ ఈవోగా తప్పించడంతో.. ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో సీఎంవో ముఖ్య కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఇక, టీటీడీ ఈవో పోస్టు నుంచి జవహర్ రెడ్డి బదిలీ కావడంతో.. ధర్మారెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ధర్మారెడ్డి ఈ బాధ్యతల్లో కొనసాగనున్నట్టుగా తెలిపింది. ఇక, ధర్మారెడ్డి ప్రస్తుతం టీటీడీ అదనపు ఈవోగా ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీగా సత్యనారాయణకు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్‌కు బాధ్యతలను అప్పగించింది. యవజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా శారదా దేవీని ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.