
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. చాలా చోట్ల అధికార పార్టీ అభ్యర్ధులు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో నిలిచే అభ్యర్ధుల విషయంలో క్లారిటీ వస్తోంది.
ఇప్పటికే అధికార వైసీపీ మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. మాచర్ల, పిడుగురాళ్ల, పుంగనూరు మున్సిపాలిటీల్లో మొత్తం వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అటు మరికొన్ని మున్సిపాలిటీల్లోనూ మెజార్టీ వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి.
ఆత్మకూరు, తుని, పలమనేరు, డోన్ మున్సిపాలిటీల్లో ఎన్నికలకు ముందే మెజార్టీ వార్డులు వైసీపీ సొంతమయ్యాయి. మరోవైపు చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ బలవంతపు విత్ డ్రాలు చేయిస్తోందంటే టీడీపీ ఆరోపిస్తోంది. అన్ని స్థానాల్లోనూ ఏకగ్రీవం చేసేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు పుంగనూరు మున్సిపాలిటీని ఇప్పటికే సొంతం చేసుకుంది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇక అభ్యర్ధులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ నానా తంటాలు పడుతోంది. ఇందుకోసం ఏకంగా క్యాంప్‌లే పెడుతోంది. కళ్యాణదుర్గం అభ్యర్ధులను ఏకంగా బెంగళూరుకు తరలించింది. చివరి నిమిషంలో వైసీపీలోకి తమ అభ్యర్ధులు చేరిపోతుండటంతో టీడీపీ ఇబ్బందులు పడుతోంది.
అనంతపురం 5వ వార్డు టీడీపీ అభ్యర్ధి ప్రసన్న లక్ష్మీ వైసీపీలో చేరింది. నిన్న ఒక్కరోజే 222 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవమయ్యారు. అటు రెబల్స్‌ను బుజ్జగించడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది.