
తెలుగుదేశంపార్టీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీని ఇబ్బందిని పెట్టే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. నంద్యాల ఫలితం వచ్చి రెండు రోజులు కాగానే వైసీపీలోని 10 మంది ఎంఎల్ఏలు జగన్ పై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. కడప జిల్లాలోని ముఖ్యనేత ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఓ హోటల్లో మంగళవారం రహస్య సమావేశం జరిగిందన్నది ప్రచారం. వారంతా ‘తమకు వైసీపీలో భవిష్యత్ లేదని కాబట్టి టిడిపిలో చేరితేనే బాగుంటుందని’ మాట్లాడుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సరే, అందులో ఏంత నిజముందో ప్రచారం చేసే వారికే తెలియాలి. అయితే, నంద్యాల ఓటమి అన్నది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందే అనటంలో సందేహం లేదు. అదేవిధంగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిగాయి. దాని ఫలితం రావాల్సి వుంది. ఇక్కడ కూడా తేడా కొడితే ఇబ్బంది మరింత పెరుగుతుంది. ఎందుకంటే, ఒక ఎన్నిక రాయలసీమలో జరిగితే, మరో ఎన్నిక కోస్తా ప్రాంతంలో జరిగింది. అందులోనూ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికంటే దాదాపు అసెంబ్లీ ఎన్నికలాంటిదే,
ఇక్కడ కూడా టిడిపినే గెలిస్తే రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ప్రజలు టిడిపికే బ్రహ్మరథం పడుతున్నారని టిడిపి మీడియా ప్రచారాన్ని ఉధృతం చేస్తుంది. ఆ ప్రచారాన్ని జగన్ తట్టుకోవటం కష్టమే. అందులో భాగమే తాజాగా మొదలైన మైండ్ గేమ్. వైసీపీ నుండి ఎంఎల్ఏలు వెళ్ళిపోతారా లేదా అన్నది పక్కనపెడితే పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరాన్ని జగన్ గుర్తించాలి. ఇప్పటి నుండే బలమైన అభ్యర్ధులను గుర్తించటం, ప్రతిపక్షం బలహీనతలపై అధ్యయనం చాలా అవసరం. ఎందుకంటే, ప్రత్యర్ధి చంద్రబాబునాయుడు మామూలోడు కాదు కాబట్టి.