Latest Videos

ఇదేంటి వర్మ.. ఇలా షాకిచ్చారు.. బాబు హామీ ఏమైనట్లు?

By Galam Venkata RaoFirst Published Jul 2, 2024, 12:50 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఆ రెండు స్థానాలకు టీడీపీ నుంచి సి.రామచంద్రయ్య, జనసేన నుంచి పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేర్లు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో వర్మ సంగతేంటన్న ప్రశ్న వినిపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. జనసేన పార్టీ అయితే వంద శాతం స్ట్రైక్‌ రేటుతో 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ గెలుపు సాధ్యమైంది. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసమైతే మూడు పార్టీల శ్రేణులు, పవన్‌ అభిమానులు తీవ్రంగా శ్రమించారు. 

ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కోసం సీటు త్యాగం చేసిన తెలుగుదేశం పార్టీ నేత ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ గురించి. పిఠాపురంలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటున్న వర్మకు.... టీడీపీ ఊహించని షాక్‌ ఇచ్చింది. పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తారని... ఆయన విజయానికి సహకరించాలని తెలుగుదేశం అధిష్టానం వర్మకు ఎన్నికల ముందు స్పష్టం చేసింది. దీంతో వర్మ, ఆయన కేడర్‌ అయోమయంలో పడింది. ఇది జీర్ణించుకోలేని విషయమే అయినా... చంద్రబాబు సర్దిచెప్పడంతో చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌తో పిఠాపురంలో కలిసి పనిచేశారు వర్మ. తన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్‌ను కలుపుకొని కష్టపడ్డారు. పర్యటనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అధిష్టానం చెప్పినట్లే భారీ మెజారిటీతో పవన్‌ కల్యాణ్‌ను గెలిపించుకున్నారు. 

ఇలా సీటు త్యాగం చేసినందుకు వర్మకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి విడతలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. న్యాయం చేస్తామన్నారు. పిఠాపురంలో ఏమాత్రం గౌరవం తగ్గకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. 

అయితే, ఏం జరిగింది.? ఎన్నికలు అయిపోయాయి. పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచిన పవన్‌ కల్యాణ్‌... కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత చంద్రబాబంతటి స్థానం సంపాదించుకున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు ఐదు కీలక శాఖలకు మంత్రి అయ్యారు. 

మరి వర్మకి ఇచ్చిన హామీ ఏమైనట్లు..? ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి ప్రాధాన్యం కింద వర్మకి ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలేదు. ఇలా అనేక ప్రశ్నలు వర్మ అనుచరులు, అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. 

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్‌ దాఖలు చేసేందుకు నేడు (జూలై 2) చివరి తేదీ. కాగా, రెండు స్థానాల్లో టీడీపీ నుంచి సీనియర్ నాయకులు సి.రామచంద్రయ్యకు, జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌కు అవకాశం లభించింది. వీరిద్దరు ఇవాళ నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కావడంతో పక్కాగా రామచంద్రయ్య, హరిప్రసాద్‌ల ఎన్నిక ఏకగ్రీవమయ్యే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో వైసీపీ బలం 11 మాత్రమే. 

ఈ నేపథ్యంలో అన్నీ త్యాగం చేసి పవన్‌ కల్యాణ్‌ను పిఠాపురంలో గెలిపించుకున్న వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పిఠాపురంలో మకాం వేసిన పవన్‌ కల్యాణే వర్మ వెనుక గోతులు తవ్వాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్మను పక్కనబెట్టి ఫిరాయింపుదారులకు తొలి విడతలో ప్రాధాన్యం ఇవ్వడమేంటన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. దీనికి జనసేన, టీడీపీ నుంచి ఏం సమాధానం వస్తుందో వేచి చూడాలి.

కాగా, ఎమ్మెల్సీగా ఉన్న సి.రామచంద్రయ్య ఎన్నికల ముందు జగన్ ఓటమిని అంచనా వేసి.. వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడంతో శాసనమండలిలో ఆయనపై అనర్హత వేటు వేశారు. ఇక, మరో రాయలసీమ నేత షేక్ మహ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. టీడీపీలో చేరారు. దీంతో ఆ రెండు స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. 

click me!