అన్నంత పనిచేశారు... వాలంటీర్లు లేకుండానే పింఛన్ల పంపిణీ.. అసలు ఉంటారా? ఉండరా?

By Galam Venkata Rao  |  First Published Jul 1, 2024, 10:31 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం అన్నంత పనిచేసింది. వాలంటీర్లు పింఛన్ల పంపిణీ ప్రక్రియను దాదాపు పూర్తిచేసేసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రారంభించిన మొదటి రోజే (జూలై 1వ తేదీనే) రికార్డు స్థాయిలో పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95 శాతం పింఛన్ నగదును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95 శాతంపైగా పింఛన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డును సెట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి నెలలోనే ఒకేరోజులో 95శాతం పైగా పింఛన్లు పంపిణీ చేయడంపై అధికార యంత్రాంగాన్ని, ఇంటింటికీ పింఛను పంపిణీలో నేరుగా పాల్గొన్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్క రోజులో ఈ స్థాయిలో పింఛన్ల పంపిణీ జరగలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 

సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేయగలరు అనేది పింఛన్ల పంపిణీతో మరోసారి రుజువు అయ్యిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరమన్నారు.

Latest Videos

undefined

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... స్వయంగా లబ్ధిదారులకు పింఛను నగదు అందజేశారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు, సిబ్బందితో కలిసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొని.. పింఛను పంపిణీని పూర్తిచేసేందుకు సహకారం అందజేశారు. పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించి.. పంపిణీ చేశారు.

గత ఏప్రిల్‌ నుంచి పెంచి ఇస్తామన్న మొత్తంతో కలిపి రూ.7వేల చొప్పున పింఛను అందజేయడంతో లబ్ధిదారులు సైతం ఆనందంలో ఉన్నారు. పలుచోట్ల పింఛన్ల పంపిణీ సంబరాలు జరిగాయి. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ అందజేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 65లక్షల మందికి పైగా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.4,408 కోట్లు విడుదల చేసింది. ఉదయం 6 గంటలకు ఇంటింటికీ నగదు పంపిణీని ప్రారంభించింది. సాయంత్రం 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 94.75శాతం పంపిణీ పూర్తిచేసింది. అంటే 61.76లక్షల మందికి రూ.416.94కోట్ల నగదు అందజేశారు. 

జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా విజయనగరం జిల్లాలో అత్యధికంగా 96.93 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 91.27 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది. 

          జిల్లా             మొత్తం పింఛన్లు నగదు అందుకున్న లబ్ధిదారులు శాతం
విజయనగరం 2,81,713 2,73,075 96.93
వైఎస్సార్ 2,60,274` 2,57,241 96.79
శ్రీకాకుళం 3,19,147 3,08,704 96.73
తూర్పు గోదావరి 2,41,771 2,32,299 96.08
కోనసీమ 2,43,534 2,33,358 95.82
క్రిష్ణా 2,42,321 2,32,045 95.76
తిరుపతి 2,69,162 2,57,500 95.63
పార్వతీపురం మన్యం 1,44,518 1.38,048 95.52
నెల్లూరు 3,13,757 2,99,537 95.47
విశాఖపట్నం 1,64,150 1,56,643 95.43
నంద్యాల 2,21,240 2,10,879 95.32
ఏలూరు 2,68,353 2,55,210 95.10
పశ్చిమ గోదావరి 2,32,885 2,21,229 94.99
అన్నమయ్య 2,23,436 2,11,442 94.63
గుంటూరు 2,58,786 2,44,871 94.62
బాపట్ల 2,33,102 2,20,209 94.47
ప్రకాశం 2,91,524 2,75,,386 94.46
ఎన్టీఆర్ 2,35,477 2,22,419 94.45
అనంతపురం 2,87,032 2,69,017 93.72
అనకాపల్లి 2,64,033 2,47,433 93.71
కాకినాడ 2,79,319 2,61,595 93.65
చిత్తూరు 2,71,696 2,54,394 93.63
కర్నూలు 2,45,229 2,27,774 92.88
పల్నాడు 2,79,975 2,59,953 92.67
శ్రీసత్యసాయి 2,70,973 2,48,223 91.60
అల్లూరి సీతారామరాజు 1,26,813 1,15,744 91.27
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 42,776 42,430 99.19
మొత్తం 65,18,496 61,76,158

94.75

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గతంలో వాలంటీర్లున్నా 85శాతమే పంపిణీ...

దాదాపు 95శాతం పింఛన్ల పంపిణీ పూర్తి కావడంపై రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి డా.కొలుసు పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దిగ్విజయంగా సాగిన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా అందరూ భావిస్తున్నారని తెలిపారు. దాదాపు రాష్ట్రంలో 61.76 లక్షల మందికి ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు 12గంటల సమయంలో దాదాపు రూ.4,170 కోట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. పెద్ద మొత్తంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఒక రికార్డు అని తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పెన్షన్లు పంపిణీ ప్రక్రియ రాత్రి 8 గంటల వరకు రికార్డ్ స్థాయిలో జరిగిందన్నారు. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ ఒక్కరోజులో కేవలం 85 శాతం మాత్రమే పంపిణీ చేయగలిగారన్నారు. ఇంత వేగంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఏనాడూ జరగలేదన్నారు. కేవలం 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులతో ఈ రికార్డ్ సాధించామన్నారు. ఒక సమర్థ నాయకత్వం, ఆదర్శవంతమైన నాయకుడు ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంత స్ఫూర్తిదాయకంగా పనిచేస్తారు, దిగ్విజయంగా పూర్తి చేస్తారనడానికి పెన్షన్ల పంపిణీ  ప్రక్రియ నిదర్శనమని తెలిపారు. 

ఇంత చక్కగా పనిచేయగలిగిన వ్యవస్థ ఉన్నప్పటికీ ఏప్రిల్ మాసంలో ఉద్దేశపూర్వకంగా, రాజకీయంగా బురద జల్లడం కోసం వాలంటీర్ లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయడం అసాధ్యమన్నారని మంత్రి పార్థసారథి గుర్తుచేశారు. కొంతమంది ప్రాణాలు పోవడానికి కారణం కూడా అయ్యారన్నారు. గతంలో తాము సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని అభ్యర్థించినప్పటికీ గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. చిత్తశుద్ధితో కనీస ప్రయత్నం కూడా చేయలేదన్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పండగ వాతావరణంలో జరిగేందుకు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇదే మాట అన్నారు. వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తిచేస్తామని పదేపదే చెప్పారు. చెప్పినట్లే చేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా..? లేకుండా చేస్తారా..? కొనసాగిస్తే వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది తెలియాల్సి ఉంది.  

click me!