అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు అసెంబ్లీలో జరిగిన చర్చలో జగన్ ఒప్పుకున్నారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల విషయంపై చేసిన ప్రకటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు అసెంబ్లీలో జరిగిన చర్చలో జగన్ ఒప్పుకున్నారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.
13 జిల్లాల ప్రజల మధ్య గొడవలు పెట్టడం ఇష్టం లేదని, అమరావతి అందరికీ అందుబాటులో ఉంటుందని, 30 వేల ఎకరాలుంటే రాజధానిని నిర్మించవచ్చని స్వయంగా జగన్ పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. అయితే రాజధాని విషయంలో సీఎం మరోసారి ప్రజలను అయోమయానికి గురిచేసేలా మాట్లాడారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
Also Read:జగన్ నిర్ణయంతో జనానికి ముప్పు తిప్పలే: మూడు రాజధానులపై బాబు వ్యాఖ్యలు
అమరావతే రాజధానిగా ఉండాలని టీడీపీ కట్టుబడి వుందని ఆయన స్పష్టం చేశారు. నాడు అమరావతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార వికేంద్రీకరణపై సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.
దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 24 విద్యాసంస్థలను.. అమరావతిలో పెట్టకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తరలించామన్నారు. ఏ జిల్లాలో ఏ రకమైన అభివృద్ధి జరగాలి, ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ రావాలని ప్రణాళికబద్ధంగా వెళ్ళామన్నారు.
కర్నూలు జిల్లా వాసులు హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కోరితే.. చంద్రబాబు వెంటనే ఆమోదం తెలిపిన సంగతిని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయానికి, పిచ్చి తుగ్లక్‌లు తీసుకున్నటువంటి నిర్ణయానికి మధ్య తేడాని ప్రజలు అర్ధం చేసుకుంటారని అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు.
మంగళవారం అమరావతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రసంగించిన జగన్ .. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం వుందన్నారు. ఈ క్రమంలో అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
Also Read:జగన్‌ది ఆత్రమే తప్ప... పనితీరు లేదు: మూడు రాజధానులపై కన్నా వ్యాఖ్యలు
దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్న సంగతిని జగన్ గుర్తుచేశారు. పాలన దగ్గర, జూడీషియల్ ఒక దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుందని దీని ఆధారంగా ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.