టీడీపీ సీనియర్ నేత రాజీనామా.. సీఎం బుజ్జగింపులు

First Published Aug 8, 2018, 11:52 AM IST
Highlights

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముడా చైర్మన్‌ పదవి వ్యాస్‌కు ఇచ్చానని, సీనియర్లు అర్థం చేసుకోకపోతే ఎలా అని ఆయన అన్నారు

టీడీపీ సీనియర్ నేత బూరగడ్డ రమేష్ నాయుడు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న సీఎం  చంద్రబాబు.. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పార్టీ సీనియర్ నేత అయిన తనకు కాకుండా మరో నేత బూరగడ్డ వేదవ్యాస్ కి మూడా ఛైర్మన్ బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో.. రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా కూడా చేసేశారు.

1983 నుంచి తెలుగుదేశం పార్టీని రమేష్‌ నాయుడు అంటి పెట్టుకుని ఉన్నారు. కాపు సామాజిక వర్గ టీడీపీ నేతల్లో రమేష్‌నాయుడు ముందు వరుసలో ఉంటారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన అవనిగడ్డ నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. 1999లో 700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2004లో మాజీ మంత్రి సింహాద్రి టీడీపీకి రాజీనామా చేసి రెబల్‌గా పోటీ చేయడంతో ఓట్లు చీలి మరో సారి రమేష్‌ నాయుడు ఓడిపోయారు.
 
సర్పంచ్‌, ఎంపీపీ, జడ్‌పి వైస్‌ చైర్మన్‌గా పని చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను పట్టించు కోవడం లేదనే ఆవేదనతో ఉన్న రమేష్‌ నాయుడును మంత్రి దేవినేని ఉమా, జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మంగళవారం సీఎం వద్దకు తీసుకువెళ్లారు. చంద్రబాబు ఏకాంతంగా రమేష్‌ నాయుడుతో మాట్లాడారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముడా చైర్మన్‌ పదవి వ్యాస్‌కు ఇచ్చానని, సీనియర్లు అర్థం చేసుకోకపోతే ఎలా అని ఆయన అన్నారు. తగిన సమయంలో తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చి రాజీనామాను ఉపసంహరించుకొని పార్టీ కోసం పని చేయాలని సీఎం కోరారు. అనంతరం రమేష్‌ నాయుడు తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్టు  చెప్పారు.

click me!