టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేత కేసులో అభియోగం నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. శరత్ అరెస్ట్‌ను స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు, పోలీసులు కావాలనే తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేత కేసులో అభియోగం నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రత్తిపాటి శరత్ ‘‘ఆవేక్షా కార్పోరేషన్ ’’ అనే కంపెనీని నడుపుతున్నారు. ఈ క్రమంలో జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో కృష్ణాజిల్లా మాచవరం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయనపై జీఎస్టీ అధికారులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు గురువారం శరత్‌ను అరెస్ట్ చేశారు.
మరోవైపు.. శరత్ అరెస్ట్‌ను స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు, పోలీసులు కావాలనే తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరిపేట టీడీపీ అభ్యర్ధిగా ప్రత్తిపాటి పుల్లారావును పార్టీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేసేందుకే అధికార పార్టీ నాయకులు పన్నాగాలు పన్నుతున్నారని పుల్లారావు వర్గీయులు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాటిని ఢీకొట్టలేకనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఇకపోతే.. రెండున్నర దశాబ్ధాలుగా ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. 1999, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2014లో చంద్రబాబు మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. పదేళ్ల పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రత్తిపాటి పుల్లారావు రాజకీయాలకు కొంతకాలం దూరంగా వున్నారు. కానీ చిలకలూరిపేటలో తర్వాత యాక్టీవ్ అయ్యారు.