అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత, ‘గీతం’ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

By sivanagaprasad kodatiFirst Published Oct 3, 2018, 7:20 AM IST
Highlights

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గీతం యూనివర్సిటీ ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గీతం యూనివర్సిటీ ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. లాస్ ఏంజెల్స్ నుంచి అలస్కా వెళుతుండగా మూర్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో ఎంవీవీఎస్‌తో పాటు మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిని బసవపున్నయ్య వెలువోలు, ప్రసాద్ వీరమాచినేని,వెంకటరత్నం కడియాల, చిన్నాగా గుర్తించారు. వీరిలో ఇద్దరు లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఎన్ఆర్ఐలు.. వీరంతా ప్రఖ్యాత వైల్డ్ లైఫ్ సఫారీ చూసేందుకు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు.

1938, జూలై 3న తూర్పు గోదావరి జిల్లా మూలపాలెంలో మూర్తి జన్మించారు. ఆయన పూర్తి పేరు మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి.. తల్లిదండ్రులు పట్టాభిరామయ్య, మాణిక్యమ్మ.. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆయన కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించారు.

అనంతరం ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 1980లో గీతమ్ యూనివర్సిటీని నెలకొల్పి దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1991లో విశాఖ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

అనంతరం 1999లో రెండవసారి ఎంపిగా గెలిచారు. రెండుసార్లు ఎమ్మెల్సీగాను సేవలందించారు. నందమూరి హరికృష్ణ మృతి ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. మూర్తి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎంవీవీఎస్ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 

click me!