వైసీపీ బెదిరింపులకు భయపడం.. అవసరమైతే జైలుకైనా వెళ్తాం: అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 18, 2021, 7:43 PM IST
Highlights

గుంటూరు జిల్లాకు వెళ్తే ప్రజలు ఘన స్వాగతం పలికారని.. రెండున్నరేళ్లలో వారిలో చాలా మార్పు వచ్చిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని అయ్యన్న తేల్చి చెప్పారు. 

తనపై ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటానన్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు . ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారని ఆయన విమర్శించారు. ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. గుంటూరు జిల్లాకు వెళ్తే ప్రజలు ఘన స్వాగతం పలికారని.. రెండున్నరేళ్లలో వారిలో చాలా మార్పు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో వచ్చిన మార్పు చూసి వైసీపీ నేతలకు భయం పట్టుకుందని.. వారి బెదిరింపులకు తాము భయపడమని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని అయ్యన్న తేల్చి చెప్పారు. 


ALso Read:నిన్న చంద్రబాబు నివాసం... ఇవాళ అయ్యన్న ఇల్లు : దూసుకొచ్చిన వైసీపీ శ్రేణులు, ఉద్రిక్తత

కాగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నిన్న ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైకే దాడికి యత్నించడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజాగా శనివారం అయ్యన్నపాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించాయి. వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో అయ్యన్న ఇంటిని ముట్టడించేందుకు కార్యకర్తలు భారీ ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసిన ఉమాశంకర్... అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు.

click me!