''పట్టుబడ్డది బాలినేని నగదే...పోలీసులకు సమాచారమిచ్చిందీ వైసిపి నేతే''

By Arun Kumar PFirst Published Jul 17, 2020, 9:07 PM IST
Highlights

జగన్ అధికారంలోకి రాగానే తనను, తన ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించేవారిపై పగబట్టాడని టీడీపీ నేత, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు ఎమ్.ఎస్. రాజు మండిపడ్డారు. 

గుంటూరు: జగన్ పాలనలో దళితులపై దాడులు, కుట్రలు, కుతంత్రాలు, అవమానాలు అత్యాచారాలు ఎక్కువయ్యాయని... దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వారిపై ఎందుకంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో సమాధానం చెప్పాలని టీడీపీనేత, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు ఎమ్.ఎస్. రాజు డిమాండ్ చేశారు. 

శుక్రవారం ఆయన మంగళగిరిలోని  పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ అధికారంలోకి రాగానే తనను, తన ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించేవారిపై పగబట్టాడన్నారు. బోటు ప్రమాదంలో మృతుల తరుపున పోరాటం చేసినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ పై, దళితుల సమస్యల తరుపున పోరాటం చేస్తున్నందుకు తూర్పు గోదావరి జిల్లా దళితనేత రాజేశ్ పై, మాజీ జడ్జి శ్రావణ్ కుమార్ పై, డాక్టర్లు సుధాకర్, అనితారాణిలపై కక్షతో అకారణంగా దాడిచేసింది వైసీపీ ప్రభుత్వం.  

తాజాగా దళిత న్యాయమూర్తి అయినా రామకృష్ణపై కూడా దాడికి పాల్పడిందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు న్యాయమూర్తిపై దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. జగన్ కు నిజంగా దళితులపట్ల, న్యాయవ్యవస్థ పట్ల ఏమాత్రం నమ్మకమున్నా తక్షణమే మంత్రి పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రాజు డిమాండ్ చేశారు. 

తన తండ్రి జయంతి కార్యక్రమం కోసం 1000 కిలోమీటర్లు వెళ్లిన జగన్, తన నివాసం పక్కనే స్వరాజ్ మైదానంలో జరిగే అంబేద్కర్ విగ్రహ శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరుకాకపోవడం శోచనీయమన్నారు. జగన్ కు దళితులపై ఎంతటి ప్రేమాభిమానాలున్నాయో, అంబేద్కర్ వంటి మహనీయుడిపై ఎంతటి గౌరవ మర్యాదులున్నాయో ఆయన చర్యతోనే అర్థమవుతోందన్నారు. ఇళ్లస్థలాల పేరుతో దళితుల భూములపై ఉక్కుపాదం మోపి, రెవెన్యూ, పోలీస్ అధికారుల సాయంతో వారి భూములను లాక్కుంటున్నది జగన్ ప్రభుత్వం కాదా అని రాజు నిలదీశారు. 

రాష్ట్రంలోని అన్నిజిల్లాలలో దళితులపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి గానీ, దళిత మంత్రులు గానీ స్పందించడంలేదన్నారు. దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతుంటే, దళిత మహిళ హోంమంత్రిగా ఉండికూడా వారికి న్యాయం జరగడంలేదన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందిన అక్రమసొమ్ము, తమిళనాడు చెక్ పోస్టులో పట్టుబడి, దేశ వ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయినా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడంలేదో సమాధానం చెప్పాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు. తాను తలుచుకుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీనే లేకుండా చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న మంత్రి బాలినేని, ముందు తన సొంతపార్టీలో తనకున్న శత్రువులగురించి తెలుసుకుంటే మంచిదని రాజు హితవుపలికారు. 

read more  

మంత్రి బాలినేని అక్రమంగా సంపాదించిన సొమ్మును తరలిస్తున్నాడని, ఆయన జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహీధర్ రెడ్డే పోలీసులకు సమాచారం ఇచ్చాడన్నారు. తన సొంత జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలే మంత్రి బాలినేని వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నారని, వారిని నియంత్రించడం చేతగాక టీడీపీపై ఆరోపణలు చేయడం బాలినేనికి తగదన్నారు.  

బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం జెండాలోని దారపుపోగుని కూడా పీకలేరనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని, టీడీపీ లేకుండా చేయడమంటే   ప్రలోభాలతో టీడీపీ నేతలను లోబరుచుకున్నంత తేలిక కాదనే విషయాన్ని బాలినేని తెలుసుకోవాలన్నారు. తమిళనాడు పోలీసులకు దొరికిన డబ్బు బాలినేనిది కాదని చెబుతున్న మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆ సొమ్ము ఎవరిదో, ఆ కారు ఎవరిదో, పట్టుబడిన నిందితులు ఎవరో, వారు బాలినేని పేరు ఎందుకు చెప్పారో, అక్కడ మంత్రి బాలినేని కుమారుడు ఎందుకున్నాడో సమాధానం చెప్పాలని రాజు డిమాండ్ చేశారు. 

బాలినేని మోనార్క్ వ్యవహారశైలిని తట్టుకోలేని సొంతజిల్లాకు చెందిన వైసీపీ నేతలే ఆడబ్బు తరలిస్తున్న సమాచారాన్ని పోలీసులకు చెప్పారన్నారు. జగన్ కు సిగ్గు, శరం, పౌరుషం, ఏమాత్రం ఉన్నా, మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేనిలను తక్షణమే మంత్రి వర్గం నుంచి తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ రాజకీయాలలోకి వచ్చినప్పటినుంచీ విశ్వసనీయత అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నాడని, ఆ మంత్రులిద్దరినీ తొలగిస్తే, ఆయన విశ్వసనీయత ఏమిటో ప్రజలకు తెలుస్తుందన్నారు. 

దళితులకు 5మంత్రి పదవులు ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న జగన్, ఆయా వర్గాలపై తన ప్రభుత్వంలో తన పార్టీవారే దాడులు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దళితుల సంక్షేమానికి తీసుకొచ్చిన జీవో నెం-25ను జగన్ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో, మాల, మాదిగ, రెల్లి కులాల కార్పొరేషన్లకు నిధులివ్వకుండా ఎందుకు ఆపేసిందో సమాధానం చెప్పాలన్నారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లకు రూపాయి కూడా ఇవ్వని జగన్ ప్రభుత్వం, ఆయా వర్గాల వారికి ఏం న్యాయం చేస్తుందో చెప్పాలన్నారు. 

చంద్రబాబు పాలనలో దళితులకు భూములు, ఇన్నోవా కార్లు, జేసీబీలు, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా బలవంతుల్ని చేయడం జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా దళితులపై దాడులను ఆపకపోతే, భవిష్యత్ లో మహా ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని రాజు హెచ్చరించారు.


 

click me!