ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసన.. సీఎం ఢిల్లీ పర్యటనపై వాయిదా తీర్మానం ఇస్తారా? అని బుగ్గన ఫైర్

By Sumanth KanukulaFirst Published Mar 18, 2023, 9:32 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. శాసనసభలో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలను బహిర్గతం చేయాలని ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నిస్తూ నిరసన కొనసాగించారు. 

అయితే టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. సీఎం ఢిల్లీ పర్యటనపై వాయిదా తీర్మానం ఇవ్వడం  ఏమిటని ప్రశ్నించారు. వాయిదా తీర్మానానికి అర్థం తెలుసా? అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏం జరిగిందో అందరికి తెలుసునని అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనల  గురించి చర్చించాలంటే.. గతంలో 30 సార్లు చంద్రబాబు ఢిల్లీ  వెళ్లారని అవి చర్చకు పెడదామా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాల గురించి చర్చించడం జరిగిందని తెలిపారు. 

పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించారని అన్నారు. టీడీపీ హయాంలో చేసిన అప్పులు, పోలవరంలో జరిగిన  తప్పులపై చర్చిద్దామా అని ప్రశ్నించారు. టీడీపీ సభ్యులకు రోజూ ఇదో అలవాటుగా మారిందని విమర్శించారు. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడే బీఏసీ సమావేశంలో ఆదివారం సభ పెట్టమని అడిగారని చెప్పారు. 

click me!