వాటికి ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణం: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

Published : Apr 23, 2022, 04:59 PM IST
వాటికి ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణం: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు బాధిస్తోందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు బాధిస్తోందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. మహిళలపై హింస, అత్యాచారాలు పెరగడానికి ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని ఆరోపించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అందుకు విజయవాడ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటన నిదర్శనమని లేఖలో పేర్కొన్నారు. 

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కూతురు కనిపించడం లేదని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. విజయవాడలో బాధితురాలిని తాను పరామర్శించిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో కూడా హోం మంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుందని దుయ్యబట్టారు. 

జాతీయ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు రాష్ట్రంలోనే జరుగుతుండటం అవమానకరమని అన్నారు. మహిళలపై జరుగుతున్న భౌతికదాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్హనీయం అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని సీఎం జగన్ చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు.  రాష్ట్రంలో దిశా చట్టం అమల్లో ఉందా? ఎన్ని కేసులను నమోదు చేశారు? ఎంత మందిని శిక్షించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.


సీఎం ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేస్తే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ పట్టుకోలేదని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌, మద్యం వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలాంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయని  చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్ చర్యలు, ప్రభుత్వ విధానాలు మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రాణభయం కలిగించే విధంగా ఉండాలని సూచించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్‌ వ్యవస్థను వాడటం మాని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించండి అని చంద్రబాబు సలహా ఇచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతికి కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు, ఇల్లు, జీవనోపాధి కల్పించాలని కోరారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వికలాంగురాలిపై అత్యాచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం రచ్చగా మారింది. ఇక, ఈ ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ శ్రేణులు అడ్డుకుని గొడవకు దిగారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  ఆరోపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడకు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు మహిళ కమిషన్ నోటీసులు జారీచేసింది. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని  కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu
Thalassemia Run 2026: ఆ రోజు ఆ తల్లి, బిడ్డని చూసి..నారా భువనేశ్వరి ఎమోషనల్ | Asianet News Telugu