టీడీపీ పక్కా ప్లాన్: విజయానికి అసలు ప్రయోగశాల ఇదే..

By sivanagaprasad KodatiFirst Published Aug 18, 2018, 2:51 PM IST
Highlights

ఏపీలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. 2019 ఎన్నికల్లో గెలిపే పరమావధిగా తన అమ్ములపొదిలోని అస్త్రాలను బయటకు తీస్తోంది. 

అమరావతి: ఏపీలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. 2019 ఎన్నికల్లో గెలిపే పరమావధిగా తన అమ్ములపొదిలోని అస్త్రాలను బయటకు తీస్తోంది. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలే రేపటి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నారు. కార్యకర్తలేంటి ఎన్నికల్లో గెలిపేంటి అనుకుంటున్నారా...అవును నిజమే కార్యకర్తలే టీడీపీకి అండదండగా నిలవనున్నారు. 

అదెలా అంటే ఓసారి మీరే చూడండి...తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏడాది పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్నిభారీగా నిర్వహించడం ఆనవాయితీ. ప్రతీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇంచార్జ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ్యత్వాలు నమోదు చేస్తారు. ఎందుకంటే ఎంత ఎక్కువ సభ్యత్వాలు నమోదైతే అధినేత దగ్గర అంత పరపతి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పార్టీ సభ్యత్వాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి..మంత్రి లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో అంతా సభ్యత్వాలపైనే దృష్టిసారించారు. 

సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు ఇన్సూరెన్స్ కూడా అందించడంతో వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సభ్యత్వాల నమోదునే టీడీపీ మెుదటి అస్త్రంగా వాడుకుంది. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలలో క్రమశిక్షన కలిగిన కార్యకర్తలను ఎంపిక చేసింది. వారికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించడం మెుదలుపెట్టింది.  అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే టీడీపీ అన్ని జిల్లాలలో పార్టీ శిక్షణా తరగతులను నిర్వహణకు శ్రీకారం చుట్టింది. 

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు...ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు....ప్రతిపక్ష పార్టీ వైఫల్యాలు.....బీజేపీతో పొత్తు.....ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లే విధంగా పథకాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశం. తరగతులకు సంబంధించి కార్యకర్తల ఎంపిక చాలా నిక్కచ్చిగా ఉంటుంది. పార్టీ పట్ల చిత్తశుద్ధితో ఉన్న కార్యకర్తలను మాత్రమే తీసుకుని శిక్షణా తరగతులకు అనుమతి ఇస్తారు. అలా బ్యాచ్ లు బ్యాచ్ లుగా తరగతులు నిర్వహిస్తారు. ఈ శిక్షణా తరగతుల అర్థం పరమార్థం ఒక్కటే టీడీపీ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడం....ప్రతీ ఓటరును నేరుగా కలిసి తెలుగుదేశానికి ఓటేసేలా మెప్పించడం. ఈ తరగతులు దాదాపుగా అన్ని జిల్లాలో కొనసాగుతున్నాయి. 

తరగతులకు మధ్యలో ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్ర మంత్రులు...జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు.....ఎంపీలు....ఎమ్మెల్యేలు....మేయర్లు...మున్సిపల్ చైర్మన్లు అతిథులుగా పిలుస్తారు. వీరు కూడా పార్టీపట్ల విధేయత...అభివృద్ధి కష్టపడి పనిచేస్తే తమ అంత స్థాయికి రావొచ్చంటూ ఉత్తేజం నింపడం ఈ గెస్టుల పని. శిక్షణా తరగతులలో కార్యకర్తలకు పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ప్రతిభ కనబరిచిన కార్యకర్తలకు అవార్డులు సైతం ఇస్తారు. 


బయట వాళ్లతోపాటు టీడీపీ నేతలు సైతం పార్టీ శిక్షణా తరగతులు మాత్రమే అనుకున్నారు. కానీ ఆశిక్షణ పొందిన వారంతా ఎన్నికల సమరంలో ఓటరు నాడి పట్టుకోనున్నసైనికుడుగా కొందరికే తెలుసు. ఇది టీడీపీకి అధికారాన్నితెచ్చిపెట్టే ప్రయోగశాల.ఈ శిక్షణా తరగతులే టీడీపీని గ్రామస్థాయిలో తీసుకెళ్లే ప్రచారకులను తయారు చేస్తోంది.  ప్రచారకులను ఈ శిక్షణా తరగతులలో అత్యంత ప్రతిభ కనబరిచిన కార్యకర్తను కన్వీనర్ గా నియమిస్తారు. ఆ తర్వాత కార్యకర్తను సేవా మిత్రగా నియమిస్తారు. అయితే కన్వీనర్ గా ఎంపికైన కార్యకర్త వెయ్యిమంది ఓటర్లకు బాధ్యత వహిస్తారు. సేవా మిత్రగా ఎన్నికైన వ్యక్తి 100 మంది ఓటర్లకు బాధ్యత వహిస్తారు. ఇలా కన్వీనర్ ఆధ్వర్యంలో 10 మంది సేవా మిత్రలు పనిచేస్తారు. అయితే జిల్లాల వారీగా ఇప్పటికే కన్వీనర్లు, సేవా మిత్రల ఎంపిక మెుదటి దశ పూర్తి కాగా రెండో దశ పూర్తవుతుంది. 

అయితే కన్వీనర్లు, సేవా మిత్రలకు మాత్రం టీడీపీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై పూర్తి స్థాయి పాఠాలు చెప్తోంది. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం....ఎందుకు పవన్ కళ్యాణ్ పార్టీకి దూరమయ్యారు......బీజేపీతో ఎందుకు జత కట్టాం......ఎందుకు విడిపోయాం.....ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎలాంటి ద్రోహం చెయ్యలేదు....బీజేపీ నమ్మించి మోసం చేసింది...అలాగే ప్రతిపక్ష పార్టీ వైసీపీ బీజేపీతో సత్సమ సంబంధాలు పెట్టుకుందని....ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతుందని వంటి అంశాలనే ప్రధాన అజెండాగా బోధిస్తున్నారట. ఎన్నికల సమయంలో ప్రతీ పౌరుడు సంధించే ప్రశ్నలు ఇవే కావడంతో వాటికి సమాధానం చెప్పడంతోపాటు తెలుగుదేశం పార్టీపై సానుభూతి వచ్చేలా ఓటరు మనస్సును మార్చేంత సామర్ధ్యం వచ్చేలా శిక్షణ ఇస్తున్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతీ పంచాయితీకి నలుగరు కన్వీనర్లు చొప్పున నియమించేలా ప్లాన్ చేసిందట టీడీపీ. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి కన్వీనర్లు మరియు సేవా మిత్రలు రంగంలోకి దిగనున్నారట. మెుత్తం మీద టీడీపీ శిక్షణా తరగతుల శిబిరం అంటే అన్ని పార్టీలలో జరిగేది కదా అనుకుంటాం. 

అన్ని పార్టీలు కూడా ఎన్నికల సమయానికి దగ్గర్లో మాత్రమే నిర్వహిస్తాయి. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే తరగతులు నిర్వహించడం అసలు ప్లాన్ ఇదన్న విషయం తెలిసే సరికి ఔరా అనుకుంటున్నారట. ఏళ్ల తరబడి శిక్షణా తరగతులు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం. అయినా వాటన్నింటిని లెక్క చెయ్యకుండా టీడీపీ భరించిందంటే దాని వెనుక ఎంత ప్లాన్ ఉందో ఇట్టే అర్థమవుతుంది.  


 


  


 

click me!