Chandrababu: ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించ‌నున్న చంద్ర‌బాబు.. జ‌న‌సేన‌-టీడీపీ వ్యూహాలు ఫ‌లించేనా?

Published : Nov 22, 2023, 05:10 AM IST
Chandrababu: ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించ‌నున్న చంద్ర‌బాబు.. జ‌న‌సేన‌-టీడీపీ వ్యూహాలు ఫ‌లించేనా?

సారాంశం

Andhra Pradesh Elections: ఎన్నికలకు మరికొద్ది నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ నెల 29న తమ పార్టీ నాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించి ప్రజలకు చేరువవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ చెప్పారు. తమ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు త్వరలోనే న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.  

Chandrababu Naidu Poll Campaign: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 29వ తేదీ నుంచి తన రాజకీయ కార్యకలాపాలను పునఃప్రారంభించే అవకాశం ఉంది. బహిరంగ సభలు, స‌మావేశాల్లో పాల్గొనేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ పొలిటిక‌ల్ గా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఊరటనిచ్చింది. అయితే, ఈ కేసుకు సంబంధించి ఆయ‌న‌ మార్గంలో అనేక అడ్డంకులు ఇంకా మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం, ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్, జైలుకు వెళ్లడంతో దాదాపు రెండున్నర నెలల సమయం ముగియడంతో దూకుడుగా రాజకీయ కార్యకలాపాలను పునఃప్రారంభించాలని టీడీపీ నాయకత్వం ఉవ్విళ్లూరుతోంది.

ఏఐజీ ఆసుపత్రిలో వైద్య చికిత్స ద్వారా చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడటం, ఇటీవల ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లో క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవడంతో రోడ్డుపైకి వచ్చి ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. తాత్కాలిక ప్రణాళికల ప్రకారం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లు భవిష్యతుకు భరోసా, యువ గళం కార్యక్రమాలను పునఃప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత వీటిని హఠాత్తుగా నిలిపివేశారు. తన తండ్రికి న్యాయసహాయం సమకూర్చే పనిలో లోకేష్ నిమగ్నమయ్యారు. ఇక టీడీపీ మిత్రపక్షమైన జనసేన కూడా మిగిలిన జిల్లాల గుండా వారాహి విజయయాత్రను సొంతంగా కొనసాగించనుంది.

వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేనలు సిద్ధమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో టీడీపీ నేతలు, కార్యకర్తలను స్థానిక కార్యక్రమాల్లో జ‌న‌సేన తో పాటు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ, జనసేన అగ్రనేతలు సంయుక్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ, తమ ఉమ్మడి మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తూ, అధికార వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ టార్గెట్ చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయి సమావేశాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి మొదట్లో అడ్డంకులు ఎదుర్కొన్నారు. అయితే, టీడీపీ-జేఎస్ కూటమిలో అనైక్యత ఉందనే ప్రచారం కోసం వైసీపీకి అవ‌కాశం ఇవ్వొద్దని అగ్రనేతలు వారికి సూచిస్తున్నారు.

అంతేకాకుండా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సవాలు చేయడం, ఈ కేసులో ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలన్న చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుండటంతో చంద్రబాబు కోర్టుల్లో పలు ఇతర కేసులను ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం. న్యాయపరమైన అడ్డంకులన్నీ అధిగమించి బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తారో చూడాలి మ‌రి. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ ఎన్నికలకు మరికొద్ది నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ నెల 29న తమ పార్టీ నాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించి ప్రజలకు చేరువవుతుందని చెప్పారు. తమ పార్టీ అధినేత త్వరలోనే న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!