విశాఖలో టీడీపీ ఎంపీల దీక్ష

First Published Jul 4, 2018, 12:46 PM IST
Highlights


రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ దీక్ష

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ ఎంపీలు దీక్ష బాట పట్టారు. ఇటీవల కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ సీఎం రమేష్ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. రైల్వే జోన్ కోసం ఇతర ఎంపీలు దీక్ష ప్రారంభించారు. 

జోన్ సాధనే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగంగా.. రైల్వే స్టేషన్ సమీపంలో ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో ఎంపీలతో పాటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వే జోన్ కోసం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా దీక్ష చేపట్టామన్నారు టీడీపీ నేతలు. జోన్ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసేందుకే ఆందోళనకు దిగామన్నారు

నాలుగేళ్లుగా జోన్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జోన్ ఏర్పాటుకు విశాఖ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమైనా అబద్ధాలు, మాయ మాటలు చెబుతూ తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. రైల్వే మంత్రిని ఎన్నిసార్లు కలిసినా జోన్ అంశం పరిశీలనలో ఉందని చెబుతూ సమాధానం దాటవేస్తున్నారని ఆరోపించారు. 

జోన్ ఇవ్వాలని కేంద్ర పెద్దలకు ఉంటే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. అయినా ఇవ్వకుండా రాష్ట్రంపై పగ సాధిస్తున్నారని విమర్శించారు నేతలు. పొరుగు రాష్ట్రం ఒడిశా అభ్యంతరం చెబుతుందని వంకలు చెప్పడం ఏమాత్రం సరికాదంటున్నారు. జోన్ కోసం జరుగుతున్న పోరాటానికి విపక్షాలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు ఎంపీలు, టీడీపీ నేతలు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో ఉద్యమించాలన్నారు. జోన్‌తో విభజన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామంటున్నారు.

click me!