వైసిపి నుండి ఆహ్వానం అందింది... వారితో టచ్ లో వున్నా..: కేశినేని నాని సంచలనం

By Arun Kumar PFirst Published Jun 8, 2023, 3:37 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీని వీడి అధికార వైసిపిలో చేరేందుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై తాజాగా నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. 

విజయవాడ : తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని వ్యవహారతీరు ఆ పార్టీని తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇప్పటికే పార్టీకి అంటీముట్టనట్లు వుంటున్న ఆయన అధికార వైసిపి నాయకులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు వైసిపి నాయకులు కూడా ఎంపీ నాని పనితీరు అద్భుతమంటూ మాట్లాడుతున్నారు. దీంతో విజయవాడ ఎంపీ నాని వైసిపి పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చేలా తాజాగా నాని మాట్లాడారు. 

వేసవిలో ఎండలు మండిపోవడంతో ఎన్టీఆర్ జిల్లాలోని ఎ.కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. ఆయా గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకువచ్చిన నాని తాగునీటి సరఫరా కోసం 17 ట్యాంకర్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ప్రజల కోసం పనిచేసే నాయకుడినని అన్నారు. పార్టీ కార్యక్రమాల కంటే ప్రజల కోసం చేసే కార్యక్రమాలే తనకు ముఖ్యమని నాని పేర్కొన్నారు. 

ప్రజల్లో మంచి పేరు వుండే నాయకులనే ఏ పార్టీలయినా కోరుకుంటాయి... తనకు వైసిపి నుండి ఆహ్వానం వస్తుందంటే మంచి నాయకుడిని అన్నట్లే కదా అని ఎంపీ నాని పేర్కొన్నారు. వైసిపి ఎంపీ అయోధ్య రామిరెడ్డి తనను వైసిపిలోకి వస్తే స్వాగతిస్తామని అన్నారని... మంచివాడిని కాబట్టే ఆయన ఆహ్వానించారని అన్నారు. అయితే తాను టిడిపిని వీడాలని అనుకోవడం లేదని... వేరే పార్టీల ఆఫర్ల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఒకవేళ ఏదయినా నిర్ణయం తీసుకుంటే వెంటనే బయటపెడతానని ఎంపీ నాని స్పష్టం చేసారు. 

Read More  గొట్టంగాళ్లు: టీడీపీ ఇంచార్జీలపై కేశినేని నాని సంచలనం

టిడిపి వీడటం లేదని అంటూనే తాను అన్ని పార్టీలతో టచ్ లో వుంటానని కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికార వైసిపితోనే కాదు బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలతోనూ టచ్ లో వుంటానని అన్నారు. పార్టీల తరపున కాకుండా తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల తరపున అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని అన్నారు. ప్రజల కోసమే వైసిపి ఎమ్మెల్యేలతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నానని నాని స్పష్టం చేసారు. 

మనం ఏం చేసినా మెచ్చుకునే వారు కొందరు ఉంటారు... అలాగే గిట్టని వారు కూడా ఉంటారని ఎంపీ నాని పేర్కొన్నారు. ఇలా తాను చేసే మంచిపనులు చూసి గిట్టనివారు ఎవరో ఏదేదో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రజల కోసమే పనిచేస్తానని ఎంపీ అన్నారు. 

ఇటీవల టిడిపి నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పాల్గొనకపోవడానికి కారణమేంటో కేశినేని నాని వెల్లడించారు. మహానాడుకు తనను ఎవరూ పిలవలేదని... రామ్మోహన్ నాయుడుకు మాత్రమే అందులో మాట్లాడే అవకాశం ఇచ్చారన్నారు. అలాగే ఇటీవల విజయవాడ సెంట్రల్ లో పార్టీ ఆఫీస్ ను అచ్చెన్నాయుడు ప్రారంభించారని... ఈ కార్యక్రమానికి కూడా తనకు ఆహ్వానం లేదన్నారు. తనను పిలవకుండా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చారని ఎంపీ నాని ప్రశ్నించారు. 

ఇటీవల వైసిపి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రావు, వసంత కృష్ణప్రసాద్ తో కలిసి వివిధ కార్యక్రమాల్లో ఎంపీ నాని పాల్గొన్నారు. అంతేకాదు ఎమ్మెల్యేలు, ఎంపీ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. దీంతో నాని పార్టీ మారతారంటూ ప్రచారం జోరందుకుంది. ఈ విషయంపై చంద్రబాబు పిలిస్తే వెళ్లి మాట్లాడతానని... తనంతట తాను వెళ్లి మాత్రం వివరణ ఇచ్చుకోనని కేశినేని నాని స్ఫష్టం చేసారు. 

click me!