అమరావతిపై కొడాలి నాని వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం: ఎంపీ కనకమేడల

Arun Kumar P   | Asianet News
Published : Sep 08, 2020, 09:59 PM IST
అమరావతిపై కొడాలి నాని వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం: ఎంపీ కనకమేడల

సారాంశం

ప్రతిపక్షసభ్యులపై, రైతులపై నిందలువేస్తూ రాజకీయాలు చేయాలని వైసిపి ప్రభుత్వం చూస్తోందని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. . 

గుంటూరు: పేదల భూముల పంపిణీ విషయంలోప్రభుత్వం చట్టవిరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ కోర్టులచేత చీవాట్లు తింటూ, చివరకు విధిలేక తమ అసమర్థతను ప్రతిపక్షాలపై, కోర్టులపై నెట్టాలని చూస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. 

''పేదలకు భూములు పంచే నెపంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. రాజధానిలో పేదలకు భూములిస్తామంటే కోర్టులకు వెళ్లారని, ప్రతిపక్షసభ్యులపై, రైతులపై నిందలువేస్తూ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు.  అందులో భాగంగానే కొడాలి నాని తన సహజధోరణిలో ఇష్టానుసారం మాట్లాడారు'' అని ఆరోపించారు. 

''మొట్టమొదటిసారి  భూములు పంచాలన్న  ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎప్పుడు వచ్చిందో, ఎవరు ఎక్కడెక్కడ కోర్టులకు వెళ్లారో చెప్పాలి. ప్రతి దానికీ ప్రతిపక్షాలను, న్యాయస్థానాలను బాధ్యులను చేస్తూ న్యాయస్థానాలను కూడా రాజకీయాల్లోకి లాగాలని ప్రభుత్వం చూస్తోంది. కోర్టులు ఎవరికిపడితే వారికి ఊరికే స్టేలు ఇవ్వవు. కోర్టులు స్టే లు ఎందుకు ఇస్తున్నాయో, తిరిగి ఆ స్టేలపై కోర్టుకు వెళితే తమ వాదనలు అక్కడ నిలవవనే విషయం కూడా పాలకులకు తెలుసు. కావాలనే ప్రభుత్వం తన పార్టీవారితో కేసులేయిస్తూ, న్యాయస్థానాలను, ప్రతిపక్షాలను తప్పుపడుతోంది'' అని ఆరోపించారు. 

read more   ప్రధాని మోదీ, పొరుగు రాష్ట్రం సీఎం సైతం...మరి జగన్ ఎందుకిలా: చంద్రబాబు ఆగ్రహం

''అనపర్తిలో వైసీపీనేత, మాజీ జడ్పీటీసీ, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడైన కత్తి భగవాన్ రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలే పేదలకు పంచే భూముల్లో అవినీతి జరిగిందని బహిరంగంగానే చెప్పారు. పేదల భూములు లాక్కొని పేదలకు ఇవ్వడం చట్టవిరుద్ధం. ఈ విషయం తెలిసికూడా చాలాప్రాంతాల్లో అసైన్డ్ భూములను పేదలకు పంచాలని బలవంతంగా లాక్కున్నారు.  రెవెన్యూ చట్టాలకు విరుద్ధంగా పశువుల మేత భూములను కూడా పేదలకు పంచాలని చూశారు. బఫర్ జోన్లలోని అటవీభూములు, పీకల్లోతు ముంపునకు గురయ్యే ఆవభూములు, ప్రకాశం జిల్లా టంగుటూరులో 1300 ఎకరాల మైనింగ్ భూములను, రాజధానిలో మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా అక్కడున్న భూములు పంచాలని నిర్ణయించారు'' అని మండిపడ్డారు. 

''రాజధాని రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై హైకోర్టుకెళితే, ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి భంగపడింది. సుప్రీంకోర్టు హైకోర్టులోనే  తేల్చుకోవాలని కూడా సూచించింది.  రాజమహేంద్రవరంలోని వైశ్యసేవాసదన్ కు చెందిన 32 ఎకరాలను కూడా ఇళ్లస్థలాలకు ఇవ్వాలని చూశారు. దానిపై కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ విధంగా అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ, ఏభూమి పడితే ఆ భూమిని తీసుకోవడం తప్పని,  కోర్టులు  తమ నిర్ణయాలను అడ్డుకుంటాయని ప్రభుత్వానికి ముందే తెలుసు.  పేదలకు ఇళ్లస్థలాలకు వీలుకాని భూములను ఎంచుకొని, ప్రతిపక్షాలపై బురదచల్లుతూ, వైసీపీనేతలు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు'' అని ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Strong Warning: మనం విలీనం చెయ్యకపోతే చంద్రబాబు ఆర్టీసీ ని అమ్మేసేవారు| Asianet News Telugu
YS Jagan Speech: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్‌ | YSRCP | Asianet News Telugu