ఎక్కడ ఏ ఆస్తి అమ్మాలా అని చూస్తున్నారు: జగన్‌పై జయదేవ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 17, 2020, 2:54 PM IST
Highlights

అమరావతి కోసం దాదాపు వంద మందికిపైగా రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

అమరావతి కోసం దాదాపు వంద మందికిపైగా రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. నవ్యాంధ్ర రాజధాని అమరావతి రక్షణకై రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభను అమరావతి జేఏసీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి హాజరైన గల్లా మాట్లాడుతూ.. కేసులు పెడుతున్నా వెనక్కు తగ్గకుండా రైతులు పోరాడుతున్నారని ప్రశంసలు గుప్పించారు. టెర్రరిస్టులపై పెట్టే కేసులను అమరావతి రైతులపై బనాయించారని ఆయన మండిపడ్డారు.

అమరావతి 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అని జయదేవ్ మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. అప్పులు తీర్చడం కోసం ప్రభుత్వం ఆస్తులను అమ్ముకుంటోందని గల్లా జయదేవ్ ఆరోపించారు.

డబ్బులు లేక రాష్ట్రంలో ఎక్కడ ఏది అమ్మాలా అని ప్రభుత్వం చూస్తోందని గల్లా ఎద్దేవా చేశారు. న్యాయస్థానాలే మనకు న్యాయం చేస్తాయన్న ఆయన... బీజేపీ నాయకులు ఇక్కడ రాజధానికి మద్దతు ఇస్తున్నారు కానీ ఢిల్లీలో కేంద్ర నేతలు మాత్రం మాట్లాడటం లేదని జయదేవ్ వ్యాఖ్యానించారు.

రాజధాని విషయం మాకు సంబంధం లేదని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. అమరావతి కోసం ఎన్నిసార్లు అయినా జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని జయదేవ్ స్పష్టం చేశారు. 

click me!