అలా పుట్టింది కాబట్టే... జగన్ ప్రభుత్వంలో విధ్వంసాలు: మంతెన సీరియస్ కామెంట్స్

By Arun Kumar PFirst Published Feb 4, 2021, 3:01 PM IST
Highlights

రాష్ట్రంలో హిందూదేవాలయాపై దాడులు జరుగుతున్నా అందుకు కారకులైన వారిలో ఒక్కరినైనా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టుకోలేకపోయిందని టిడిపి ఎమ్మెల్సీ మంతెన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసాలతోనే పుట్టిందని... అధికారంలోకి వచ్చాక కూడా అదే కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. రాష్ట్రంలో హిందూదేవాలయాపై దాడులు జరుగుతున్నా అందుకు కారకులైన వారిలో ఒక్కరినైనా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టుకోలేకపోయిందన్నారు. మంత్రులు, వైసీపీనేతలు ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుతూ, టీడీపీపై నిందలేయడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

''అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనను సీబీఐకి అప్పగించామని ప్రభుత్వంచెప్పింది. నిజంగా సీబీఐకి అప్పగించి ఉంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల కాపీని ఎందుకు ప్రజలముందుంచలేదు. అంతర్వేది ఘటనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా హిందూమతంపై, దేవాలయాలపై జరిగిన అనేకఘటనలపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలి'' అని మంతెన డిమాండ్ చేశారు. 

''మంత్రి వెల్లంపల్లి జరుగుతున్న ఘటనలకు టీడీపీ, బీజేపీలే కారణమంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. రామతీర్థంలో రాములవారి శిరస్సు తొలగించినప్పుడే వెల్లంపల్లి తనమంత్రి పదవికి రాజీనామా  చేసుంటే ప్రజలంతా అతన్ని గౌరవించేవారు. గతంలో దేవాదాయ మంత్రులుగా పనిచేసినవారు, టీటీడీ ఛైర్మన్లుగా పనిచేసినవారు, ఎంతో నిజాయితీతో, నిబద్ధతతో పనిచేశారు. హిందూధర్మాన్ని కాపాడటానికి వారంతా కృషిచేశారు'' అన్నారు. 

read more  విగ్రహాల ధ్వంసం.. విచారణలో అంతా బయటికొస్తుంది: వెల్లంపల్లి

''రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా డీజీపీ విచారణల పేరుతో కాలయాపనచేస్తున్నాడు తప్ప  దోషులను పట్టుకోవడంలో చిత్తశుద్ధి చూపడంలేదు. ప్రవీణ్ చక్రవర్తిని విచారించామని చెప్పిన పోలీసులు, అతను ఏం చెప్పాడో ఎందుకు ప్రజలకు వెల్లడించడం లేదు. హిందూమతంపై, దేవాలయాలపై 161 వరకు ఘటనలు జరిగినా ముఖ్యమంత్రి ఒక్కరోజుకూడా ఎందుకు స్పందించలేదు? ముఖ్యమంత్రి  అంటే సచివాలయానికి వెళ్లడం, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోవడం కాదని జగన్ తెలుసుకోవాలి'' అని మండిపడ్డారు.

''దేవాలయాలపై జరిగిన ఘటనలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినవారిపై తప్పుడు కేసులుపెట్టడం దారుణం. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టిసారించి ప్రత్యేకాధికారుల బృందంతో విచారణ జరిపించాలి. బూతులమంత్రి కొడాలినాని విగ్రహాల ధ్వంసం గురించి అవహేళనగా మాట్లాడిన తీరుతోనే, దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వ వైఖరిఏమిటో తేలిపోయింది'' అని ఆరోపించారు. 

''అంతర్వేది రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించి ఉంటే ఆ ఆదేశాల ప్రతులను తక్షణమే మీడియాకు విడుదల చేయాలి.  అచ్చెన్నాయుడిపై 307 కేసుపెట్టిన ప్రభుత్వం, దేవాలయాలను తానే ధ్వంసం చేశానన్నప్రవీణ్ చక్రవర్తిపై ఎటువంటి కేసులుపెట్టింది? రాష్ట్రంలోని దేవాలయాల్లో సీసీ.కెమెరాలు ఏర్పాటుచేశానని చెప్పుకుంటున్న డీజీపీ, ఇంతవరకు కెమెరా దృశ్యాల ఆధారంగా దోషులనుఎందుకు పట్టుకోలేకపోయాడు? ఆయన ఏర్పాటుచేయించిన కెమెరాల్లో దోషులచిత్రాలు కనిపించడం లేదా?'' అని నిలదీశారు.

''దోషులను పట్టుకోవాలి... శిక్షించాలని డీజీపీకి ఉంటే, ఆయన ఇన్నాళ్లూ తాత్సారం చేయడు. అధికారపార్టీ వారిని కాపాడాలనే ఉద్దేశంతోనే ఆయన నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాడు. టీడీపీవారే దేవాలయాలు ధ్వంసం చేశారని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. విధ్వంసాలు చేయడం, వికృతచర్యలకు పాల్పడటం వంటివి వైసీపీ ప్రభుత్వానికే తెలుసు. అధికారంలోకి వస్తూనే దేవాలయం లాంటి ప్రజావేదికను ధ్వంసం చేశారు. రామతీర్థంలో రాముడి తల తొలగించిన రోజునే వెల్లంపల్లి దేవాదాయశాఖా మంత్రిగా పనికిరాడని, అసమర్థుడని ప్రజలంతా  నిర్ణయించుకున్నారు. దేవాలయాలపై దాడులవిషయంలో బహిరంగచర్చకు టీడీపీ సిద్ధంగా ఉంది. సంబంధంలేని ఆరోపణల తో కాలయాపన చేయకుండా ప్రభుత్వం అసలు దోషులను పట్టుకుంటే ప్రజలంతా హర్షిస్తారు'' అని మంతెన సూచించారు.
 

click me!