మహానటులు ఎస్వీ రంగారావును మరిపిస్తున్న జగన్: టిడిపి ఎమ్మెల్సీ సెటైర్లు

Arun Kumar P   | Asianet News
Published : Jan 20, 2021, 12:47 PM IST
మహానటులు ఎస్వీ రంగారావును మరిపిస్తున్న జగన్: టిడిపి ఎమ్మెల్సీ సెటైర్లు

సారాంశం

దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోవడం చేతకాని ముఖ్యమంత్రి, మంత్రి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు.  

విజయనగరం: మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు రామతీర్థం రాముని విగ్రహం తయారీ కోసం భక్తిభావంతో  ఇచ్చిన విరాళాన్ని దేవాదాయశాఖ వెనక్కి  పంపడం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలను తిరస్కరించడం దేశంలో ఇదే ప్రథమమని... ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమేనని అన్నారు. కొబ్బరి చిప్పకు ఆశపడే వెల్లంపల్లికి భక్తులు మనోభావాల విలువ ఏం తెలుసు అంటూ మండిపడ్డారు. 

''ప్రజలు వెల్లంపల్లి శ్రీనివాసును తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. పవిత్రమైన దేవాదాయశాఖను తన వ్యహారాలశైలితో అపవిత్రం చేస్తున్నారు. దేవాలయాలపై దాడులు చేసిన నిందితులను పట్టుకోవడం చేతకాని వెల్లంపల్లి తన పదవి కాపాడుకునేందుకు జగన్ కాళ్ళు పట్టుకుంటున్నారు'' అని మండిపడ్డారు.

''అభినవ నటుడు ముఖ్యమంత్రి జగన్ మహా నటుడు ఎస్వీ రంగారావును మరిపిస్తున్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై ఓ వైపు వైసీపీ కార్యకర్తల చేత దాడులు చేయిస్తూ... మరోవైపు ప్రతిపక్షాలే  దాడులు చేయిస్తున్నాయంటున్నారు. తానే హిందూ మతాన్ని ఉద్దరిస్తున్నానంటూ ప్రజల ముందు బాగా నటిస్తున్నారు'' అని ఎద్దేవా చేశారు.

''దాడులు చేసిన వారిని పట్టుకోవడం చేతకాని ముఖ్యమంత్రి, మంత్రి  ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. 150 ఆలయాలపై దాడులు జరిగితే  విచారణకు ఆదేశించి నేరస్తులను పట్టుకొనే ప్రయత్నం చెయలేదు.  దాడులు ప్రతిపక్షం పనే అంటూ ఆరోపణ చెయ్యడం దేనికి సంకేతం? నేరం నిగ్గు తేల్చాల్సిన పోలీసుల కంటే ముందే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిపక్షంపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం చెయ్యడమేంటి? అధికారంలో వున్నామని ఎదురు దాడి చేస్తూ బుకాయిస్తూ ఎన్నాళ్లు పరిపాలన సాగిస్తారు?'' అని ప్రశ్నించారు.

''అంతర్వేది  రధం దగ్దం నుండి రామతీర్ధం ఘటన వరకు దొషులను గుర్తించక పోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? దేవాలాయాలపై దాడులు అరికట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరితే మత విద్వేషాలు రెచ్చగొట్టారని కేసుపెడతారా? అసమర్ధతను కప్పిపుచ్చు కొనేందుకు జగన్నాటక సూత్రధారులు ఎంతకైనా తెగిస్తారనడానికి నిదర్శనం ఇది కాదా? దాడులు  అరికట్ట లేక, దొషులను పట్టుకోలేక ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రతిపక్ష నేతపై కేసు పెట్టి చేతకాని తనాన్ని బయట పెట్టుకుంది. చంద్రబాబుని బూచిగా చూపెట్టి బూకరింపులకు దిగుతామంటే కుదరదు. దాడులపై ప్రభుత్వం  ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి'' అని కోరారు.

''కంటికి రెప్పలా కాపాడాల్సిన దేవాలయాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఎటుపోతుందో అర్ధం కావడంలేదు.  వైసీపీ ప్రభుత్వం దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని అరికట్టకుండా రాష్ట్రంలో మతాల మద్య చిచ్చు పెట్టే విదంగా వ్యవహరిస్తోంది. భోగి పండుగ నాడు ప్రజలంతా భోగి మంటల్లో చలికాగితే, జగన్, వైసీపీ నేతలు మాత్రం మతాల మధ్య మంటలు రేపి ఆ మంటల్లో చలికాచుకున్నారు. వైసీపీ ఇకనైనా తన డ్రామాలు కట్టిపెట్టి అన్ని మతాల గౌరవాన్ని కాపాడాలి'' అని సత్యనారాయణ రాజు సూచించారు.


 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu