దర్శనానికి వెళ్లి హుండీ కొట్టేసే రకం ఈ దేవాదాయ మంత్రి: టిడిపి ఎమ్మెల్సీ సెటైర్లు

By Arun Kumar PFirst Published Sep 10, 2020, 1:35 PM IST
Highlights

రాష్ట్రంలోని దేవాలయాల్లో వరుస ప్రమాదాలు జరుగుతుంటే వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టకుండా రాజకీయాలు మాట్లాడడానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లికి సిగ్గనిపించడం లేదా అని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు.  

గుంటూరు: ప్రస్తుతం రాష్ట్రానికి దేవాదాయ శాఖ మంత్రిగా వున్న వెల్లంపల్లి శ్రీనివాస్ వార్డు మెంబర్ కి ఎక్కువ, కార్పొరేటర్ కి తక్కువ అంటూ టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఎద్దేవా చేశారు. ఆయనకి కేవలం కాలం కలిసిరావడం వలనే మంత్రి పదవి వచ్చిందన్నారు. అలాంటిది ఆయన పాలన పై దృష్టి పెట్టకుండా చంద్రబాబు నాయుడిని, టీడీపీని తిట్టడం సిగ్గుచేటని మంతెన మండిపడ్డారు.

''16 నెలల్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన చేసిందేంటి? ఇప్పటి వరకు ఎన్ని దేవాలయాలను సందర్శించారో చెప్పాలి? అసలు రాష్ట్రంలో దేవాదాయ శాఖ కింద ఎన్ని  దేవాలయాలున్నాయో మంత్రి వెల్లంపల్లి కి తెలుసా?'' అని ప్రశ్నించారు. 

''దేవాలయాల్లో వరుస ప్రమాదాలు జరుగుతుంటే వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టకుండా రాజకీయాలు మాట్లాడడానికి సిగ్గనిపించడం లేదా? వెల్లంపల్లికి జగన్ భజన తప్ప భక్తుల మనోభావాలు పట్టవా?  భూకబ్జాలపై చూపిన శ్రద్ద దేవాదాయ శాఖపై ఎందుకు చూపటం లేదు. వెల్లంపల్లి లాంటి వారికి దేవాదాయ శాఖ ఇవ్వడం వల్లే ఆలయాల్లో ఈ పరిస్థితి నెలకొంది'' అన్నారు. 

read more  ఆయన మంత్రా, వీధి రౌడీనా?: కొడాలి నానిపై సిపికి ఫిర్యాదుచేసిన టిడిపి

''స్వామి దర్శనానికి వెళ్లి హుండీ కొట్టేసే టైప్ వెల్లంపల్లి. దేవాలయాల ద్వారా ఆదాయం ఎంత వస్తుందా అని చూస్తున్నారు తప్ప దేవాలయాల్లో భక్తులకు సౌకర్యాలు ఎలా ఉన్నాయో అని ఏనాడైనా ఆలోచించారా? వెల్లంపల్లి లాంటి చేతకాని వ్యక్తికి దేవాదాయశాఖ ఇచ్చినందుకు ఆ దేవుడు కూడా భాదపడుతున్నాడు'' అని పేర్కొన్నారు. 

''లాక్డౌన్ లో అర్చకులు పడ్డ ఇబ్బందులు గురించి మంత్రి ఒక్కసారైనా ఆలోచించారా ? అర్చకులకు ప్రభుత్వం ఇస్తామన్న సహాయం ఇంకా అందలేదు. దాని గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు. వెల్లంపల్లి పనితీరుపై రాష్ట్ర ప్రజలే కాదు దేవాలయాల్లోని అర్చకులు కూడా సంతృప్తి చెందటం లేదు. మంత్రి ఇకనైనా రాజకీయాలు మాట్లాడటం మాని రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి పై దృష్టి పెట్టాలి'' అని మంతెన సత్యనారాయణ రాజు సూచించారు. 

click me!