కరోనాపై తప్పుడు ప్రచారం... జగన్ అరెస్ట్ ఎప్పుడు?: డిజిపికి బుద్దా ప్రశ్న

By Arun Kumar PFirst Published Mar 24, 2020, 7:47 PM IST
Highlights

కరోనా వైరస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై చర్యలు  తీసుకుంటామని ప్రకటించిన పోలీసులు ముందుగా ముఖ్యమంత్రి జగన్ పై చర్యలు తీసుకోవాలని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. 

గుంటూరు: రోజురోజుకు కరోనా వైరస్ రాష్ట్రంలో వ్యాప్తిచెందుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలెవ్వరూ ఇళ్లలోకి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు కరోనా వ్యాప్తిపై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ప్రజలను మరింత భయపెడుతున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు డిజిపి ప్రకటించారు. అయితే ఈ విషయంలో అరెస్ట్ చేయాల్సి వస్తే మొదట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నే అరెస్ట్ చేయాల్సి వస్తుందని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు.  

''జగన్ గారికి 2 ఏళ్ళ జైలు శిక్ష ఎప్పుడు? కరోనా మీద అబద్దాలు వ్యాపింపజేస్తే రెండేళ్లు జైలు అని డీజీపీ కార్యాలయం హెచ్చరించింది. కరోనా లేదు ఎన్నికలే ముద్దు అంటూ జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. అసలు కరోనా ఏపీలో లేదు ఎన్నికలు నిర్వహించండి అని సీఎస్ గారితో ఎన్నికల సంఘానికి లేఖ రాయించారు'' కాబట్టి ముఖ్యమంత్రిపైనే మొదట చర్యలు తీసుకోవాలంటూ వెంకన్న ట్విట్టర్ ద్వారా డిజిపిని కోరారు.

''ఆఖరికి సుప్రీం కోర్టుని కూడా తప్పుదోవ పట్టించబోయారు. కరోనా వస్తుంది... పోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. పేరాసిట్మాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, బ్లీచింగ్ వేస్తే చచ్చిపోతుంది అని స్వయంగా జగన్ గారే స్థానిక సంస్థలను కబ్జా చెయ్యడమే లక్ష్యంగా ప్రజల్ని రిస్క్ లో పెట్టారు

''అంటూ మరో ట్వీట్ ద్వారా వెంకన్న ఆరోపించారు. ''ఆయనతో పాటు ఈ రోజుకీ వైకాపా నేతలు కరోనా వల్ల వచ్చే నష్టం ఏమి లేదు అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. అరెస్టులు ఎప్పుడో డీజీపీ కార్యాలయం చెప్పాలి''అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. 

click me!