గతంలో వైసిపి నాయకులు ఎస్ఈసీ పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఓ బహిరంగా లేఖ రాశారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైసిపి ప్రభుత్వానికి మధ్య మళ్లీ వివాదం మొదలయ్యింది. ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్దపడగా ప్రభుత్వం అందుకు అడ్డుచెబుతోంది. ఈ నేపథ్యంలో గతంలో వైసిపి నాయకులు ఎస్ఈసీ పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఓ బహిరంగా లేఖ రాశారు.
అశోక్ బాబు రాసిన లేఖ యధావిధిగా:
తేది : 24.01.2021
బహిరంగ లేఖ
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గారికి,
ఆర్థికశాఖామంత్రి
నమస్కారం,
ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మీరు మంచి మేధా సంపత్తిని కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ లేఖ రాస్తున్నాను...
''రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని చంద్రబాబునాయుడు అనరాని మాటలు అనడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం'' - పీఏసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి (19.04.2019)
2019లో మీరు చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను... ఎవరు తప్పు చేసినా చీల్చి చెండాడే మీరు రాష్ట్రంలో ఇష్టానుసారంగా జరుగుతున్న రాజ్యాంగ హననంపై మాట్లాడరెందుకు? ప్రతాపం ఇప్పుడేమైంది? ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ హోదా కలిగి ఉంటుంది అంటూ ఈగ కూడా వాలకుండా నాడు కాపలా కాసిన మీరు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
అమెరికాలో ట్రంప్ తరహాలోనే ఆంధ్రాలో వ్యవహారం ఉంది. అమెరికా రాజ్యాంగానికి విరుద్దంగా ట్రంప్ వ్యవహరిస్తున్నట్లే జగన్మోహన్‌రెడ్డి భారత రాజ్యాంగానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ రాజ్యాంగ వ్యతిరేకం. ఆర్టికల్ 243 ఖ, 243 ్గ (ూ) లను ఉల్లంఘించడమే. ఈసీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు గైర్హాజరవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? ఎన్నికలను వాయిదా వేసే అధికారం, తిరిగి ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానిదే అని కోర్టులు అనేకసార్లు స్పష్టంగా చెప్పాయి. అయినా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తుంది రాజ్యాంగ వ్యవస్థలన్నీ మా అడుగులకు మడుగులొత్తాల్సిందే అన్న విధంగా వ్యవహరించడం ఏమిటి? ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోర్టులు చెప్పాయే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే ఎన్నికల సంఘం చేయాలని ఎక్కడా చెప్పలేదు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా సిఎం జగన్ రెడ్డి అమలు చేయరు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని పని చేయనీయరు. కోర్టుల్ని, రాజ్యాంగ సంస్థల్ని జగన్మోహన్ రెడ్డి చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ పరిపాలనపై మీకు నమ్మకం లేదా? మీ పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందుకే ఎన్నికలకు భయపడుతున్న విషయం వాస్తవం కాదా?ఒక్కసారి మీ పార్టీకి చెందిన నేతలు ఎలక్షన్ కమిషన్ మీద చేసిన వ్యాఖ్యలు పరిశీలించండి.
ఎన్నికల కమిషనర్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలు
* ఎన్నికల కమిషనర్ నిష్పాక్షికతే కాదు.. విచక్షణ కూడా కోల్పోయారు. పేదల ఇళ్ల పట్టాలు అడ్డుకునేందుకు కుట్ర - రూ.5వేల కోట్ల నిధులు పోగొట్టుకోవాలా.? - సీఎం జగన్ రెడ్డి (16.03.2020)
* ఎన్నికల కమిషనర్ కుల గజ్జి వెధవ - రాష్ట్రానికి డబ్బులు రాకుండా చేస్తారా.? సిగ్గులేదా మీకు.? మీరు మనులుషలు కాదా.? టీడీపీ కన్నా నీచమైన వైరస్ లేదు - విప్, కాపు రామచంద్రారెడ్డి (16.03.2020)
* టీడీపీతో ఎస్‌ఈసీ కుమ్మక్కయ్యారు - మంత్రి తానేటి వనిత (16.03.2020)
* ఎన్నికల కమిషన్ పై ఏదో శక్తి పని చేసింది - నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధిని మించి నిర్ణయం తీసుకున్నారు - ఎన్నికల వాయిదా సైంధవ నిర్ణయం - ప్రభుత్వ సలహాదారు, సజ్జల రామకష్ణా రెడ్డి (16.03.2020)
* టెర్రర్ గ్రూపుల కంటే ఘోరంగా ఎన్నికల వాయిదా నిర్ణయం - చంద్రబాబు సీఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదని వ్యవస్థల్లోకి స్లీపర్ సెల్స్ ను చొప్పించారు. - ఎంపీ, విజయసాయిరెడ్డి (16.03.2020)
* ఒక వ్యక్తి కోసం న్యాయాన్ని నిమ్మగడ్డ తుంగలో తొక్కుతున్నారు.- విప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి - (16.03.2020)
* రాష్ట్రానికి కాదు.. ఈసీకి కరోనా సోకింది - చంద్రబాబు ప్రలోభాలకు నిమ్మగడ్డ లొంగిపోయారు - మంత్రి, పేర్ని నాని (16.03.2020)
* కేంద్ర నిధులను అడ్డుకునేందుకు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో చంద్రబాబు ఎన్నికలు వాయిదా వేయించారు - జోగి రమేష్ (16.03.2020)
* ప్రజారోగ్యాన్ని దష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా శుభపరిణామం (11గంటలకు మున్సిపల్ కార్యాలయంలో) - చంద్రబాబు ఓటమి భయంతో నిమ్మగడ్డతో నాటకమాడించారు (3గంటలకు ఇంటివద్ద) - ఆర్.కె.రోజారెడ్డి (16.03.2020)
* ఒక వ్యక్తి కోసం ఎన్నికలు వాయిదా వేయడం బాధాకరం - ఏకగ్రీవాల భయంతోనే నీచ ఎత్తుగడలు - మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (16.03.2020)
* కరోనా కాదు.. కమ్మరోనా ఎఫెక్ట్ - విచక్షణాధికారాల పేరుతో ఏకపక్ష నిర్ణయాలు సరికాదు - స్పీకర్, తమ్మినేని సీతారాం (16.03.2020)
* టీడీపీకి కరోనా సోకింది అందుకే లాబీయింగ్ చేసి ఎన్నికలు వాయిదా వేయించింది - స్థానిక ఎన్నికలకు టీడీపీ మొదటి నుండీ వ్యతిరేకం - బీసీ రిజర్వేషన్లను కుట్రతో అడ్డుకున్నారు. - చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి (15.03.2020)
* ఇన్నాళ్లూ రాష్ట్రాభివద్ధిని అడ్డుకున్నారు - ఇప్పుడు ఎన్నికల కమిషనర్‌తో నిధులు రాకుండా చేయిస్తున్నారు - మంత్రి, శంకర నారాయణ (15.03.2020)
* ఉద్యోగ భిక్ష పెట్టిన చంద్రబాబు రుణాన్ని నిమ్మగడ్డ తీర్చుకునేందుకు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు - మంత్రి, బొత్స సత్యనారాయణ (15.03.2020)
* తనకు, తన కుమార్తెకు పదవులిచ్చిన చంద్రబాబు రుణం తీర్చుకోవడానికే ఎన్నికలు వాయిదా - మంత్రి, కన్నబాబు (15.03.2020)
* ఎన్నికల వాయిదాతో చంద్రబాబు, టీడీపీ నేతలు పైశాచిక ఆనందం పొందడం తప్ప ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు - మంత్రి, ముత్తంశెట్టి శ్రీనివాస్ (15.03.2020)
* ఈసీ మంచి ఆలోచనతో వాయిదా నిర్ణయం తీసుకోలేదు - సి.రామచంద్రయ్య (15.03.2020)
* కరోనా తీవ్రతను పరిశీలించకుండా ఎన్నికలు వాయిదా వేసి కమిషన్ తప్పు చేసింది - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (17.03.2020)
* ఎస్‌ఈసీ నిర్ణయం ఏకపక్షం - ఏశాఖతోనూ సమావేశం కాకుండా నిర్ణయం తీసుకున్నారు - ఎంపీ లావు శ్రీకష్ణ దేవరాయలు. (17.03.2020)
* ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు పెంపుడు కుక్క - బాబు డైరెక్షన్‌లో ఎన్నికలు వాయిదా వేశారు - కోరుముట్ల శ్రీనివాసులు (17.03.2020)
* చంద్రబాబుకు మేలు చేసేందుకే ఎన్నికలు వాయిదా నిర్ణయం - ప్రభుత్వంపై కక్ష సాధించడం కోసమే వాయిదా - అన్నీ తానే అనుకోవడం ఎస్‌ఈసీకి తగదు - మంత్రి ఆదిమూలపు సురేష్ (17.03.2020)
* చంద్రబాబుకు మేలు చేయడం కోసమే ఎన్నికల కమిషనర్ పని చేస్తున్నారు - మంత్రి, వెల్లంపల్లి శ్రీనివాస్ (17.03.2020)
* ఒక కులానికి, ఒక పార్టీకి సాయపడుతున్న నిబద్దత లేని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ - అతను చెబితే ఎస్పీలు, కలెక్టర్లను మార్చాలా - మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (18.03.2020)
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా చేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడులపై మీరు తక్షణమే స్పందించి రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణకు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
పి. అశోక్‌బాబు,
శాసనమండలి సభ్యులు.