వర్మపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్: "వెన్నుపోటు" పై కోర్టుకెళ్తానని వార్నింగ్

By Nagaraju TFirst Published Dec 24, 2018, 3:52 PM IST
Highlights

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ వర్మ మండిపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడిని అప్రతిష్ట పాల్జెయ్యాలన్న ఉద్దేశంతో వాస్తవాలు వక్రీకరించి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా తీస్తున్నారని ఆరోపించారు.  

పిఠాపురం: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ వర్మ మండిపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడిని అప్రతిష్ట పాల్జెయ్యాలన్న ఉద్దేశంతో వాస్తవాలు వక్రీకరించి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా తీస్తున్నారని ఆరోపించారు.  

వర్మ సినిమా వెనుక వైసీపీ నాయకులు హస్తం ఉందని ఆరోపించారు. లేని సంఘటనలను చేర్చి రాద్దాంతాలు, వివాదాలు సృష్టించడం రామ్‌గోపాల్‌వర్మకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఎన్టీఆర్ జీవితంలో లేని చరిత్రను తీసుకువచ్చి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా తీస్తున్నారని మండిపడ్డారు. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత  వైసీపీ నాయకుడు రాజేష్‌ అని వర్మ తెలిపారు. నిర్మాతను బట్టి సినిమా వెనుక ఎవరు ఉన్నారో అర్థమవుతుందన్నారు. ఎన్నికలు సమీస్తున్న తరుణంలో సీఎం నారా చంద్రబాబుని కించపరిచి అప్రతిష్ట పాలు చెయ్యాలన్న లక్ష్యంతో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలోని దగా-కుట్ర పాటను ముందుగా విడుదల చేశారని విమర్శించారు.
 
గతంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న ధ్యేయంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని ప్రజలు ఆమోదించారని గుర్తు చేశారు. అయితే వాస్తవాలు వదిలి చంద్రబాబుపై బురద చల్లడమే లక్ష్యంగా ఈ సినిమా తీస్తున్నారని దీన్ని ప్రజలు ఆమోదించరని స్పష్టం చేశారు. 

తక్షణమే దగా-కుట్ర పాటను నిషేధించాలని ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్  వర్మ డిమాండ్‌ చేశారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలో వెన్నుపోటు పాటను తొలగించాలని సెన్సార్‌ బోర్డును కోరతానని అలాగే హైకోర్టుకు సైతం వెళ్తానని తెలిపారు. 

చరిత్రను వక్రీకరిస్తున్న రామ్‌గోపాల్‌వర్మకు, అందుకు సహకరిస్తున్న వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  ఇప్పటికైనా వర్మ తన పద్ధతి మార్చుకోవాలని  హితవు పలికారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

రామ్ గోపాల్ వర్మను తరిమి కొడతారు.. టీడీపీ నేత

click me!