కేంద్రంపై తిరుగుబాటు: టిడిపి వార్నింగ్

First Published Mar 14, 2018, 11:55 AM IST
Highlights
  • కేంద్రప్రభుత్వంపై టిడిపి స్వరం పెరుగుతోంది.

కేంద్రప్రభుత్వంపై టిడిపి స్వరం పెరుగుతోంది. అసెంబ్లీలో టిడిపి ఎంఎల్ఏలు మాట్లాడిన విధానమే అందుకు నిదర్శనం. ఒకవైపు బిజెపి చంద్రబాబునాయుడు, రాష్ట్రప్రభుత్వంపై మండిపడుతున్నపుడు తాము మాత్రం మౌనంగా కూర్చోవటం వల్ల ఉపయోగం లేదని టిడిపి అనుకున్నట్లుంది. అందుకనే ఒక్కసారిగా గేర్ మార్చింది.

ఇంతకీ అసెంబ్లీలో టిడిపి ఏమన్నదంటే, ‘ఏపికి అన్యాయం చేస్తే కేంద్రంపై తిరుగుబాటు తప్పదం’టూ టిడిపి విప్ కూన రవికుమార్ తీవ్రంగా హెచ్చరించారు. కూన హెచ్చరికతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రత్యేకహోదా అన్నది రాష్ట్ర ప్రజల్లో ఓ సెంటిమెంటుగా మారిపోయిందన్నారు. ఇప్పుడుగనుక కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ప్రజలు తిరగబడతారని చెప్పారు.

ఒక్క ఏపిలోని జనాలు మాత్రమే కాదని యావత్ ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా తిరగబడతారంటూ చెప్పటంతో బిజెపి సభ్యులకు మండిపోయింది. విభజన హామీలను నెరవేర్చాలని చంద్రబాబు కేంద్రం చుట్టూ 29 సార్లు తిరిగినా ఉపయోగం కనబడలేదంటూ కూన మండిపడ్డారు. ఏపిలోని వెనుకబడిన జిల్లాలకు రూ. 350 కోట్లిచ్చిన కేంద్రం తర్వాత పిఎంవోకు తెలీకుండానే మంజూరైందని చెప్పి నిధులను వెనక్కు తీసుకోవటాన్ని ఎద్దేవా చేశారు.

రూ. 9654 కోట్లతో 11 జాతీయ సంస్ధల ఏర్పాటు చేయాల్సుండగా కేంద్రం మాత్రం కేవలం రూ. 680 కోట్లతో 9 సంస్ధలను మాత్రమే మంజూరు చేయటమేంటని ధ్వజమెత్తారు. కూనే కాకుండా తర్వాత మాట్లిన రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా కేంద్రంపై మండిపడ్డారు. సభ్యులు మాట్లాడిన విధానం చూస్తుంటే కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడమని బహుశా చంద్రబాబే గ్రీన్  సిగ్నల్ ఇచ్చినట్లుంది.

click me!