ఆ మహిళ మరణం మెదడువాపుతో కాదు కరోనాతోనే... ప్రభుత్వం దాస్తోంది: నిమ్మల ఆరోపణ

By Arun Kumar P  |  First Published Mar 17, 2020, 8:20 PM IST

దుబాయి నుంచి కాకినాడలోని అంతర్వేదికి వచ్చిన మహిళ కరోనాతో చనిపోతే ప్రభుత్వం మాత్రం మెదడువాపు వ్యాధితో చనిపోయిందని తప్పుడు సమాచారాన్ని విడుదల చేసిందని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 


గుంటూరు: రాష్ట్రంలో ఎన్నికలను తిరిగి నిర్వహించాలని, ఇప్పటివరకు జరిగిన అరాచకాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలను పరిశీలనలోకి తీసుకొని ఎన్నికల సంఘం ఈ దిశగా ఆలోచన చేయాలని టీడీపీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఐదురోజుల్లో ప్రలోభాలు, రౌడీయిజం,  బెదిరింపులతో ప్రభుత్వం ఏవిధంగా బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడిందో అందరూ చూశారని, ఎన్నికల వాయిదా వల్ల వ్యవధి పెరుగుతున్నందున అలాంటి సంఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే ఎన్నికలకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని నిమ్మల విజ్ఞప్తిచేశారు. 

Latest Videos

తెలుగుదేశం హయాంలో కూడా ఏకగ్రీవాలు జరిగాయని సమర్థించుకుంటున్న మంత్రులు, ఇతర వైసీపీనేతలు ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 653 జడ్పీటీసీలకు ఒక్కస్థానం మాత్రమే ఏకగ్రీవమైందని, ఈనాడు 526 జడ్పీటీసీలుంటే, వాటిలో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని నిమ్మల తెలిపారు. 

అదేవిధంగా గత ఎన్నికల్లో 10,092 ఎంపీటీసీలకు కేవలం 270 స్థానాలు అంటే మొత్తంగా 2.5శాతం స్థానాలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయని, జగన్ జమానాలో మాత్రం 7287 ఎంపీటీసీలకు 2406 స్థానాలు అంటే 30శాతం ఏకగ్రీవమయ్యాయని నిమ్మల వివరించారు. ఈ లెక్కలు చూస్తేనే రాష్ట్రంలో ఏస్థాయిలో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయో అర్థమవుతోందని, గుంటూరు, ప్రకాశంతో పాటు, చిత్తూరు, కడప, కర్నూలులోనే ఈ చర్యలు ఎక్కువగా జరిగాయన్నారు. కడపలో 431, చిత్తూరులో 425, ప్రకాశంలో 350, కర్నూల్లో 312, గుంటూరులో 208 స్థానాలు బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయన్నారు. 

5జిల్లాల్లోనే 1786 స్థానాలు ఏకగ్రీవమవడానికి గల కారణమేమిటో ముఖ్యమంత్రి , మంత్రులు సమాధానం చెప్పాలన్నా రు. నిజంగా జగన్ ప్రజారంజక పాలన అందించి ఉంటే, మిగిలిన జిల్లాల్లో కూడా అదేస్థాయిలో ఎందుకు ఏకగ్రీవాలు జరగలేదని నిమ్మల ప్రశ్నించారు. ఆయా జిల్లాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు బుసలుకొట్టేలాచేసి, ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడిందన్నారు. అనంతపురం జిల్లాలో అధికారపార్టీ నేత కాపు రామచంద్రారెడ్డి అండతో, మాజీమంత్రి, టీడీపీనేత కాలవ శ్రీనివాసులుపై దౌర్జన్యం చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని, దీనిపై సీఎం ఏం సమాధానం చెబుతాడో చెప్పాలన్నారు. 

నామినేషన్ల సమయంలో కాలవ శ్రీనివాసులును స్వయంగా తన కార్యాలయంలోకి పోలీస్ కమిషనర్ తీసుకెళ్లాడని, అలాంటి ప్రదేశంలోనే ఆయనపై హత్యాయత్నం జరిగిందన్నారు. మున్సిపల్, కమిషనర్ కార్యాలయాలు, ఆర్వో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు ఎంతబాగా పనిచేస్తున్నాయో, వైసీపీ కనుసన్నల్లో అవి నడుస్తున్నాయడానికి ఇదే నిదర్శనమన్నారు. (ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులును కమిషనర్ తీసుకెళుతున్న వీడియోను, అదేసమయంలో అక్కడున్న కాపురామచంద్రారెడ్డి మేనల్లుడు ధనుంజయరెడ్డి, అతని అనుచరుడు బోర్ వెల్ నాగిరెడ్డి, వైసీపీ సోషల్ మీడియాకు చెందిన అమరేశ్, వరికూటి రామకృష్ణారెడ్డిల కదలికల వీడియోను నిమ్మల విలేకరులకు ప్రదర్శించారు.) 

read more  ఎన్నికలు ఆరు నెలలు వాయిదా వేసినా సరే... మా బాధంతా అదే: అవంతి వ్యాఖ్యలు

మాజీమంత్రి, బలహీనవర్గాల నాయకుడిపై పట్టపగలే హత్యాయత్నానికి యత్నించారని, ఆయనకే రక్షణలేకపోతే, ఇక సామాన్యుడి పరిస్థితేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. కరోనాపై ప్రపంచం తీరు ఒకలా ఉంటే, ముఖ్యమంత్రి జగన్ తీరు మరో రకంగా ఉందని, ఆయన మాటలు చూస్తే తీవ్రమైన నిరాశా, నిస్పృహలో ఉన్నాడని స్పష్టమవుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా 157దేశాల్లో విస్తరించిందని, దానికారణం గా ఇప్పటికే లక్షా69వేల710 కేసులు నమోదయ్యాయని, 7వేల మందివరకు మృతిచెందారని, ఇరాన్ లో ఒక్కరోజులోనే 129 మంది మృతిచెందారని నిమ్మల పేర్కొన్నారు. 

ఈ వైరస్ ప్రభావంతో దేశంలో కూడా తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఇప్పటివరకు 19మందికి వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. 18 రాష్ట్రాల్లో విద్యాసంస్థలను మూసివేశారని, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో ఎన్నికలు కూడా వాయిదావేశారన్నారు. కరోనా ప్రభావంతో సెన్సెక్స్ 2వేల పాయింట్లు పతనమైందని, 24శాతం ఎకానమీ కూడా దెబ్బతిన్నదన్నారు. ఈ విధంగా ప్రపంచమంతా కరోనాపై ఒకరకంగా స్పందిస్తుంటే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడని, రాష్ట్రంలో నమోదయ్యే కేసుల వివరాలు బయటకు రాకుండా చూస్తున్నాడన్నారు. 

దుబాయి నుంచి కాకినాడలోని అంతర్వేదికి వచ్చిన మహిళ కరోనాతో చనిపోతే, ప్రభుత్వం ఆమె మెదడువాపు వ్యాధితో చనిపోయిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. జగన్ ప్రభుత్వం కరోనా విషయంలో పూర్తిగా విఫలమై, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. విదేశాలనుంచి రాష్ట్రంలోకి ఎంతమంది వచ్చారు....వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటనే వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడంలేదన్నారు. 

తమ దగ్గరున్న సమాచారం ప్రకారం, విదేశాల నుంచి రాష్ట్రంలోకి పది, పదిహేనురోజుల్లో 10వేలమంది వరకు వచ్చారని, 2వేలమంది కడపకే వచ్చారని, 1800మంది పశ్చిమగోదావరికి, వెయ్యిమంది తూర్పుగోదావరికి వచ్చారని, వారిలో ఎంతమందికి ప్రభుత్వం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిందో జగన్ సమాధానం చెప్పాలన్నారు. కరోనా లక్షణాలతో రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 7గురు ఆసుపత్రుల్లో చేరారని, ఇప్పటికే 89 మంది శాంపిల్స్ ను పరీక్షలకు పంపడం జరిగితే, 75మందికి నెగిటివ్ అని రిపోర్ట్ రావడం జరిగిందన్నారు.

read more  ఏపి పోలీస్ డిపార్ట్ మెంట్ లో కరోనా కలవరం... కానిస్టేబుల్ కొడుకుకు లక్షణాలు

ఇంత జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి, కరోనా అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దిశ చట్టంగురించి అసెంబ్లీలో మాట్లాడుతూ, ద్విచక్రవాహనానికి టోల్ ఫీజు కట్టడానికి వెళ్లారని చెప్పిన జగన్ ఇప్పుడు పారాసిట్మాల్ వేసుకుంటే, బ్లీచింగ్ వాడితే కరోనా తగ్గిపోతుందని చెప్పడం ఆయనలోని జ్ఞాన  సంపత్తికి నిదర్శనమని నిమ్మల దెప్పి పొడిచారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి, మాటలు చూస్తుంటే, ఆయన రెండో పులకేశిని తలపిస్తున్నాడన్నారు. 

తన రాజకీయ స్వార్థంకోసం జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధమైతే, ఆయన బారినుంచి రాష్ట్రాన్ని ఎన్నికల కమిషనర్ కాపాడా డన్నారు. ఎన్నికల కమిషనర్ పై విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గతంలో ఏడేళ్లపాటు గవర్నర్ దగ్గర కార్యదర్శిగా పనిచేశాడని, ఆయనకు రాజ్యాంగ బద్ధంగా ఎలా వ్యవహరించాలో తెలుసునని నిమ్మల స్పష్టంచేశారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎప్పుడూ కూడా చంద్రబాబు హయాంలో ఉన్నత పదవుల్లో లేడని, వై.ఎస్ హయాంలోనే ఆయన కీలక పదవుల్లో కొనసాగాడనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలన్నారు. 

కేవలం 15రోజుల్లోనే నోటిఫికేషన్, కోడ్ అమల్లోకి వచ్చేలా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినప్పుడు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జగన్ కి మంచివాడిగానే కనిపించాడన్నారు. చంద్రబాబుని మంత్రివర్గం సమావేశం కూడా నిర్వహించకుండా ఎన్నికల సంఘం అడ్డుకుందన్నారు. ఎన్నికల సంఘానికి రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కులను ముఖ్యమంత్రి ప్రశ్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నించే హక్కు ఆయనకు లేదని నిమ్మల స్పష్టంచేశారు. 

ముఖ్యమంత్రి అనేవాడు కులాలపట్ల ప్రజల్లో సామరస్యం పెంచాలని.. కానీ ఆస్థాయిలో ఉన్నవ్యక్తి ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని గుర్తించకుండా, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా ప్రవర్తింస్తున్నందుకు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. 

ప్రభుత్వ విప్ కాపురామచంద్రారెడ్డి రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులపై హత్యాయత్నంచేయించాడని బొండాఉమా, బుద్దా వెంకన్నలపై హత్యాయత్నం చేయించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలపై జగన్ ఏం చర్యలు తీసుకుంటాడో స్పష్టం చేయాలన్నారు. కాపు, పిన్నెల్లి ప్రభుత్వ విప్ లా లేక మర్డర్ల విప్ లో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని రామానాయుడు డిమాండ్ చేశారు.
 

click me!