
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అకాల వర్షంతో నష్టపోయిన పంటను రైతులు ట్రాక్టర్‌లో వేసుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చూపించేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. తణుకు-ఇరగవరం రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ట్రాక్టర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారని పోలీసులను ప్రశ్నించారు.
ఆ ట్రాక్టర్‌ను ఎందుకు పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారని పోలీసుల తీరుపై మండిపడ్డారు. నష్టపోయిన పంటను చూపించడానికి తరలిస్తున్నారని.. ఇందులో గంజాయి ఏం పట్టుకెళ్లడం లేదుగా అని ప్రశ్నించారు. మీడియా సమక్షంలో పంట నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు తీసుకెళ్తుంటే.. ట్రాక్టర్‌ను ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడమేమిటని ప్రశ్నించారు. తాను పాలకొల్లు అని.. తణుకు అంటే పాకిస్తాన్ కాదని అన్నారు. ఏపీ రైతులు ఎక్కడికైనా వెళతారని అన్నారు. రైతులు ధాన్యం రోడ్లపై పడేయరని.. వారిని అలా చూడకడదని అన్నారు. రైతుల సెల్ ఫోన్ తీసుకోవడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడ సివిల్ డ్రెస్‌లో ఉన్న ఒక వ్యక్తి తాను కానిస్టేబుల్ అని చెప్పగా.. నేమ్ ప్లేట్ ఏది, సివిల్ డ్రెస్‌లో ఉంటే పోలీసు అని ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రైతు పోరుబాటు పేరుతో.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరం నుంచి తణుకు వై జంక్షన్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు.