పేదల ఇళ్లపై రివర్స్ టెండరింగ్‌.. 7 వేల కోట్లు నష్టం: నిమ్మల

By Siva KodatiFirst Published Nov 22, 2020, 4:05 PM IST
Highlights

చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను రూపాయికి ఇస్తానంటూ జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే, టీడీపీ శాసనసభ ఉపనేత నిమ్మల రామానాయుడు

చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను రూపాయికి ఇస్తానంటూ జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే, టీడీపీ శాసనసభ ఉపనేత నిమ్మల రామానాయుడు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీప్రభుత్వంలో 20 లక్షలఇళ్ల నిర్మాణం ప్రారంభమైతే, టిడ్కోకింద 7లక్షల58వేల788 ఇళ్లనిర్మాణం మొదలైందన్నారు.

వాటిలో 4లక్షల96వేల 572ఇళ్లను జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేసిందని చెప్పారు. 90 నుంచి 100శాతం పూర్తైన 2లక్షల 62వేల 216 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడానికి జగన్ ప్రభుత్వానికి మనస్సు రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకి పేరొస్తుందనే జగన్, టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన ఇళ్లను రద్దు చేశారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంలో పూర్తైన ఇళ్లతో పాటు, ఇళ్ల స్థలాలను డిసెంబర్-25న ఉచితంగా ఇస్తామని జగన్ చెప్పడం, ఇళ్ల లబ్దిదారులను మోసగించడమేనని నిమ్మల వ్యాఖ్యానించారు.

300, 360, 430 చదరపు అడుగుల్లో నిర్మించిన ఇళ్లన్నింటినీ, బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా ఉచితంగానే లబ్ధిదారులకు అందిస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలోనే చెప్పారని ఆయన గుర్తు చేశారు.

నేడు జగన్ 300చదరపు అడుగుల్లో నిర్మితమైన వాటినే రూపాయికి ఇస్తామంటూ మరో కొత్త నాటకం మొదలెట్టారని రామానాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన 4 లక్షల 96వేల 572 ఇళ్లను రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దుచేయడం ద్వారా  జగన్ ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన రూ.7,488కోట్లను కోల్పోయిందని ఆయన వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వం ఇస్తామంటున్న సెంటు భూమి పథకానికి టీడీపీ ఏనాడూ అడ్డుపడలేదని నిమ్మల గుర్తుచేశారు. రాజధానిలో, మరోప్రాంతంలో మాత్రమే కొందరు ఇళ్లపట్టాలకు తమ భూములెలా ఇస్తారంటూ కోర్టులకెళ్లారని ఆయన వివరించారు.

కేవలం 10 నుంచి 15శాతం భూమి మాత్రమే కోర్టు వివాదాల్లో ఉంటే, మిగిలిన భూమిని ఈ ప్రభుత్వం పేదలకు ఎందుకు పంచడం లేదని రామానాయుడు నిలదీశారు. పేదలకు ఇవ్వాలనుకుంటున్న ఇళ్లు, స్థలాలు కోర్టుల్లో ఉంటే డిసెంబర్ 25న పంచుతామని జగన్ ఎలా చెప్పారని రామానాయుడు దుయ్యబట్టారు.

తాను అధికారంలోకి వస్తే, పేదలకు సంవత్సరానికి 5లక్షల ఇళ్లు నిర్మిస్తానని జగన్  తన మేనిఫోస్టోలో చెప్పారన్నారు. ఆ ప్రకారం చూసినా ఈ 18 నెలల్లో ఆయన 7.50 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని నిమ్మల డిమాండ్ చేశారు.

ఎక్కడైనా ఒక్కటంటే ఒక్క ఇల్లైనా ఇచ్చినట్లు వైసీపీ నేతలు నిరూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వం పేదలకు నిర్మించే ఇళ్లను షీర్ వాల్ టెక్నాలజీతో, పేరెన్నికగన్న సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిందని చెప్పారు.

ఆదా పేరుతో జగన్ హైదరాబాద్ కు చెందిన అనామక కంపెనీలకు ఇళ్లనిర్మాణాన్ని అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ చెబుతున్న రూపాయికే ఇల్లు కావాలో, చంద్రబాబు నిర్మించిన ఇళ్లు కావాలో తేల్చుకోమని వాలంటీర్లు అడుగుతుంటే, ఇళ్ల లబ్దిదారులంతా తమకు చంద్రబాబు నిర్మించిన ఇళ్లే కావాలంటున్నారని నిమ్మల సెటైర్లు వేశారు.

వైసీపీ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న సెంటు స్థలంలో కట్టే ఇంటిలో నివాసం సాధ్యమవుతుందా అని చెప్పారు. గ్రామాల్లో కనీసం రెండు నుంచి మూడు సెంట్లు, పట్టణాల్లో సెంటున్నర నుంచి రెండు సెంట్ల వరకు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా టీడీపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇళ్లన్నింటినీ, ఆనాడు కేటాయించిన విధంగానే ఎటువంటి నిబంధనలు, ఆంక్షలు లేకుండా జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పారు. 

click me!