ప్రివిలేజ్ కమిటీ సిఫారసులు.. మాకు స్పీకర్ మైక్ కట్ చేయరనే అనుకుంటున్నా: నిమ్మల రామానాయుడు

By Siva KodatiFirst Published Sep 21, 2021, 6:09 PM IST
Highlights

మంగళవారం ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రివిలేజ్ కమిటీ అయ్యింది. స్పీకర్ తమ్మినేని సీతారాంపై వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేయడంతో అచ్చెన్నాయుడు క్షమాపణలను పరిగణనలోనికి తీసుకుని క్షమించింది ప్రివిలేజ్ కమిటీ.

ప్రివిలేజ్ కమిటీ సిఫారసులపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పందించారు. ప్రివిలేజ్ కమిటీ చెప్పినవన్నీ సత్యదూరమని నిమ్మల వ్యాఖ్యానించారు. తాము శాసనసభను తప్పుదోవ పట్టించలేదని ఆయన స్పష్టం చేశారు. మాకు మైక్ ఇవ్వకూడదనే నిర్ణయం స్పీకర్ తీసుకోరని భావిస్తున్నానన్నారు. అసెంబ్లీలో తాము ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని రామానాయుడు స్పష్టం చేశారు. 

అంతకుముందు మంగళవారం ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రివిలేజ్ కమిటీ అయ్యింది. ఛైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే కూన రవి, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌‌లపై నమోదైన ఫిర్యాదులపై చర్చించింది ప్రివిలేజ్ కమిటీ. నోటీసు ఇచ్చిన సమయానికి తాను అందుబాటులో లేను అని ఫలితంగా నోటీసు అందుకోలేకపోయానని ప్రివిలేజ్ కమిటీకి కూన రవి సమాచారం ఇచ్చారు. తాను హైదరాబాద్ వెళ్లానని .. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పిస్తానని కూన రవి చెప్పారు.

Also Read:ముగిసిన ప్రివిలేజ్ కమిటీ భేటీ: అచ్చెన్నాయుడు, నిమ్మలకు మైక్ కట్

ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు తనకు మరో అవకాశం ఇవ్వాలని కూన రవి కోరారు. మరోవైపు తనకు అందిన నోటీసుకు ప్రివిలేజ్ కమిటీకి లేఖ రూపంలో సమాధానం ఇచ్చారు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. తనకు గవర్నర్‌కు మధ్య జరిగిన అంతర్గత సమాచార వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు నిమ్మగడ్డ. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో వుందనే విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు మాజీ ఎస్ఈసీ.

ఇక స్పీకర్ తమ్మినేని సీతారాంపై వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేయడంతో .. ప్రివిలేజ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలు కోరారు ఛైర్మన్ కాకాని. అయితే స్పీకర్‌ను దూషించారనే ఫిర్యాదుతో అచ్చెన్నాయుడు క్షమాపణలను పరిగణనలోనికి తీసుకుని క్షమించింది ప్రివిలేజ్ కమిటీ. మరోవైపు మద్యం షాపులు, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో తప్పుదోవ పట్టించారని కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిపైనా చర్యలు తీసుకుంటామని ప్రివిలేజ్ కమిటీ తెలిపింది. ఇదే సమయంలో నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడికి మైక్ కట్ చేయాలని కమిటీ సభాపతికి సిఫారసు చేసింది.

click me!