
గుజరాత్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆఫ్గన్‌లోని తాలిబన్లకు టీడీపీ నేతలకు తేడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకున్నారని.. ఆ సొమ్ముతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. మత్తుమందుకు , విజయవాడకు సంబంధం లేదని పోలీసులు తేల్చారని మంత్రి వెల్లడించారు. అయినప్పటికీ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు.
సీఎం జగన్‌పై కక్షతో రాష్ట్ర గౌరవ ప్రతిష్టలను మంటగలుపుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. రాజకీయ పబ్బం కోసం టీడీపీ ఎంతకైనా తెగిస్తోందని.. తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్నినాని మండిపడ్డారు. సోషల్ మీడియాలో సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. డ్రగ్స్ కేసులో సంబంధం లేకున్నా రాష్ట్రానికి ఆపాదిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణలో బయటపడిన డ్రగ్స్ కేసులో సైతం అక్కడి ప్రతిపక్షాలు.. ప్రభుత్వాన్ని నిందించిందే గానీ, హైదరాబాద్‌కు ముడి పెట్టలేదని నాని గుర్తుచేశారు.