అమరావతిని ముక్కలు చేసి... వికేంద్రీకరణ అంటారా, విశాఖలో 70 వేల ఎకరాల్లో గోల్‌మాల్ : టీడీపీ

By Siva KodatiFirst Published Sep 15, 2022, 9:55 PM IST
Highlights

అమరావతిని 3 మూడు ముక్కలు చేసి పరిపాలన వికేంద్రీకరణ అంటే తెలుగుజాతి క్షమించదన్నారు పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన కోట్లాది రూపాయల సంస్థల్ని ఎందుకు వెల్లగొట్టారని ఏలూరి నిలదీశారు
 

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే సీఎం దృష్టిలోపరిపాలన వికేంద్రీకరణ అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. అసెంబ్లీ లో రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరి, సీఎం ప్రసంగం తదితర అంశాలపై చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించారు. భేటీ అనంతరం ఏలూరి మాట్లాడుతూ.. కుట్రతో అమరావతిని 3 మూడు ముక్కలు చేసి పరిపాలన వికేంద్రీకరణ అంటే తెలుగుజాతి క్షమించదని ఆయన హెచ్చరించారు. విశాఖలో గత మూడున్నరేళ్లలో 70 వేల ఎకరాల భూమి చేతులు మారిందని.. ఉత్తరాంధ్రపై అంత అభిమానం ఉంటే 3.5 ఏళ్లుగా ఎందుకు విశాఖను అభివృద్ధి చేయలేదని సాంబశివరావు ప్రశ్నించారు. 

తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన కోట్లాది రూపాయల సంస్థల్ని ఎందుకు వెల్లగొట్టారని ఏలూరి నిలదీశారు. విశాఖ దోపిడీనే లక్ష్యంగా మంది మార్బలాన్ని దింపి అడ్డంగా దోచుకుంటూ కులాల మధ్య కుంపటి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని రైతులపై ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టేలా సీఎం ప్రసంగించటం దుర్మార్గమని సాంబశివరావు మండిపడ్డారు. ఏదో రకంగా అమరావతిని చిదిమేయాలనే కుట్రకు సీఎం తెరలేపి కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ALso Read:పాలనా వికేంద్రీకరణతో మంచి ఫలితాలు : ఏపీ అసెంబ్లీలో జగన్

ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే తపనే సీఎం మాటల్లో వ్యక్తమైందని సాంబశివరావు వ్యాఖ్యానించారు. తన అసమర్థత, చేతకాని తనం కప్పిపుచ్చుకునేందుకు సీఎం ఇవాళ మళ్లీ అమరావతిపై తన ద్వేషం వెళ్లగక్కారని ఆయన మండిపడ్డారు. కులాలు, మతాలు , ప్రాంతాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్ ప్రసంగం సాగిందని ఏలూరి సాంబశివరావు దుయ్యబట్టారు. అరసవల్లిలో ఉండే వాళ్లు శ్రీశైలం, తిరుపతి వెళ్ల కూడదా అని ఆయన ప్రశ్నించారు. 

దేవుళ్ళను కూడా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని ఏలూరి ఫైరయ్యారు. చంద్రబాబు ఇంటి ముందు రోడ్డు మాకు ముఖ్యం కాదని.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా రోడ్లు లేని దుస్థితిలో గ్రామాలు ఉన్నాయన్నారు. టీడీపీ హయాంలో 75 వేల కిలోమీటర్లు రోడ్లు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఏలూరి సాంబశివరావు గుర్తుచేశారు. 

click me!