వైసిపి సర్కార్ గవర్నర్ తోనే నీళ్లు నమిలించిందిగా..: టిడిపి ఎమ్మెల్యేల సెటైర్లు  

By Arun Kumar P  |  First Published Feb 5, 2024, 1:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పించిందని టిడిపి నాయకులు ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభంవేళ గవర్నర్ ప్రసంగం నిజాలకు దూరంగా వుందన్నారు. 


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల ప్రారంభమే టిడిపి సభ్యుల నిరసనలతో జరిగింది. అసెంబ్లీకి ర్యాలీగా వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎలాగోలా పోలీస్ వలయాన్ని దాటుకుని అసెంబ్లీకి చేరుకున్న టిడిపి సభ్యలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సమయంలో నిరసన చేపట్టారు. గవర్నర్ ప్రసంగం సాగుతున్నంతసేపు తమతమ స్థానాల్లో కూర్చునే నినాదాలు చేసి ఆ తర్వాత పైకిలేచి నినాదాలు చేసారు. గవర్నర్ చేత ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని ఆరోపిస్తూ టిడిపి సభ్యులు వాకౌట్ చేసారు. 

అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యుల ప్లకార్డులు ప్రదర్శిస్తూ... పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రసంగాన్ని ముగించుకుని వెళుతున్న గవర్నర్ ను అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఆయన వెళ్ళే దారిలో టిడిపి సభ్యులు బైఠాయించగా వెంటనే మార్షల్స్ వారిని పక్కకు జరిపారు. ఈ క్రమంలో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకోగా అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకులపై లాఠీ చార్జ్ చేయిస్తారా? అంటూ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Latest Videos

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం జరిగిన బిఎసి సమావేశాన్ని కూడా టిడిపి బహిష్కరించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగానే బిఏసిని బాయ్ కాట్ చేసినట్లు తెలిపారు. అనంతరం టిడిపి నాయకులు గవర్నర్ ప్రసంగంపై స్పందించారు. 

Also Read  నా ప్రభుత్వ పాలన అద్భుతం... ప్రజలకు మేం చేసిందిదే..: అసెంబ్లీలో గవర్నర్ సుదీర్ఘ ప్రసంగం

ముందుగా టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగం గోబెల్స్ ప్రచారంలా వుందన్నారు. అసలు ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటయినా నిజముందా? రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశంసించడం విడ్డూరమని అన్నారు. అప్పుల్లో మాత్రమే ఏపీ నెంబర్ వన్... మిగతా ఏ విషయాల్లో కాదని ఎమ్మెల్యే ఎద్దేవా చేసారు. 

175 సీట్లలో గెలిపించాలని ప్రజలను కోరే అర్హత జగన్ కు లేదని బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అబ్బద్దాల ప్రసంగాన్ని గవర్నర్ చదవలేకపోయారని... చాలాసార్లు నీళ్లు నమిలారని అన్నారు. ప్రసంగిస్తుండగా గవర్నర్ నాలుగు సార్లు నీళ్లు తాగారని అన్నారు. ఆయన ప్రసంగంలో కేవలం   అంకెల గారడీ మాత్రమే వుందని బుచ్చయ్య చౌదరి అన్నారు. 

మరో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... రాజ్యాంగ పదవిలో వున్న గవర్నర్ తో ప్రభుత్వం అబద్ధాలు, అసత్యాలు చెప్పించిందన్నారు. ఎన్నికల వేళ ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి ఈసారి వైసిపి గవర్నర్ ను వాడుకుందని అన్నారు. జగన్ శ్రేయస్సు కోరుకునే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటివారే రోడ్ల దుస్థితి గురించి మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. గవర్నర్ చేత అబద్దాలు చెప్పిస్తున్నారని తెలిసే అసెంబ్లీ నుండి వాకౌట్ చేసినట్లు ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. 

click me!