మీరు స్పీకర్ పోడియం ఎక్కింది మరిచారా..?: ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కు టిడిపి ఎమ్మెల్యే లేఖ

By Arun Kumar PFirst Published Sep 23, 2021, 10:12 AM IST
Highlights

టిడిపి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు ను అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలంటూ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్ధన్ కు ఎమ్మెల్యే అనగాని లేఖ రాశారు. 

అమరావతి: తోటి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు,  రామానాయుడిని ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలంటూ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు అనగాని లేఖ రాసారు.  

''శాసనసభలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ప్రతిపక్షం ‎బాధ్యత. ప్రజా సమస్యలకు పరిష్కారం కనుగొనే వేదికపై ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ ఉపపక్ష నేతలు కింజారపు అచ్చెన్నాయుడు,  నిమ్మల రామానాయుడులకు మాట్లాడే అవకాశం లేకుండా చేయడమనేది సరైన విధానం కాదు. సభ్యుల వివరణ కూడా తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు'' అన్నారు.

read more  ముగిసిన ప్రివిలేజ్ కమిటీ భేటీ: అచ్చెన్నాయుడు, నిమ్మలకు మైక్ కట్

''ప్రజాహితం కోరేవారు ఎవరైనా ప్రజల తరపున ప్రతిపక్షం నుంచి సూచనలు, సలహాలు కోరుకుంటారు... కానీ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షం ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించడమే నేరంగా, ప్రజలపక్షాన మాట్లాడడం ఘోరంగా భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను శత్రువులుగా చూసే విధానం ఏమాత్రం సమర్థనీయం కాదు'' అని పేర్కొన్నారు. 

''చట్ట సభల్లో మాట్లాడే అవకాశం లేకుండా చేయడమంటే రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్ర హక్కును నిర్వీర్యం చేయడమే. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆ పార్టీ నేతలు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మర్చిపోయారా?  మీరు స్పీకర్‌ పోడియం ఎక్కి ఆందోళనలు చేయలేదా? ప్రజాస్వామ్య దేవాలయాలుగా చెప్పుకునే చట్టసభల్లో ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని, శాసనసభాపక్ష ఉప నేతలకు మాట్లాడే అవకాశం లేకుండా  తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలి'' అని తన లేఖ ద్వారా కోరారు ఎమ్మెల్యే అనగాని. 

click me!