మొక్కజొన్నలు కొనలేని దద్దమ్మ మూడు రాజధానులు కడతాడట..: జగన్ పై టిడిపి ఎమ్మెల్యే సెటైర్లు

By Arun Kumar PFirst Published May 21, 2023, 11:51 AM IST
Highlights

అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను కొనుగోలు చేయకుండా వైసిపి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు.  

హైదరాబాద్ : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడం చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంటా..! అంటూ వైఎస్ జగన్ పై టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రవ్యాఖ్యలు చేసారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు కొనుగోలుచేసి రైతులను ఆదుకుంటామంటూ జగన్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేసి ఇప్పుడు చేతులు ఎత్తేసిందని... అలాంటిది మూడు రాజధానులు కడతామంటే ప్రజలు విశ్వసిస్తారా? అని ఎమ్మెల్యే అనగాని ఎద్దేవా చేసారు. 

వైసిపి పాలనలో రైతులకు నష్టాలే తప్ప లాభాల మాట వినిపించడం లేదని అనగాని అన్నారు. వ్యవసాయాన్ని గాలికొదిలేసి రైతుల బాధలు పట్టించుకోకుండా కేవలం దళారులకు మాత్రమే లాభంచేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రంగాలను నాశనం చేసిన వైసిపి సర్కార్ వ్యవసాయ రంగాన్ని కూడా పాతాళంలోకి తొక్కిపెట్టారని... ఇలాంటి సీఎంను రైతు ద్రోహి అని కాకుండా ఇంకేమంటారు? అంటూ ఎమ్మెల్యే అనగాని మండిపడ్డారు. 

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చి ఇప్పుడేమో సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారని అనగాని అన్నారు. పంటలు అమ్మేవారు ముందుగా ఆర్బికే లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం మెలిక పెట్టిందని అన్నారు. అయితే ఎంత పొలమున్నా ఒక్కో రైతునుండి ఐదు ఎకరాల పంటనే కొనుగోలు చేస్తామని అంటున్నారని... మిగతా పంటను రైతులు పారబోసుకోవాలా? అని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం చేస్తూ దళారులకు మేలుచేయడం కోసమే ఇలాంటి ఆంక్షలు పెట్టారని టిడిపి ఎమ్మెల్యే ఆరోపించారు.

Read More  టీడీపీ మహానాడులో 15 తీర్మానాలు.. సంక్షేమ పథకాల రద్దుపై యనమల క్లారిటీ

బినామీ కాంట్రాక్టర్లకు, సాక్షిలో అబద్ధపు ప్రకటనలకు కోట్ల రూపాయిల ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు చేసే జగన్ రెడ్డికి రైతులకు సాయం చేయడానికి మాత్రం మనసు రావడంలేదా? అని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడంలో జగన్ రెడ్డికి ఏపాటి చిత్తశుద్ది ఉందో ఆయన అనుసరిస్తున్న విధానాలే చెబుతున్నాయన్నారు. అసలు  రైతు భరోసా కేంద్రాలే పెద్ద భోగస్ అని అనగాని మండిపడ్డారు. 

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట కళ్లముందే వర్షానికి తడిసిపోవడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారని అన్నారు. ఇలా బాధలో వున్న రైతులను ఆదుకోకపోగా ఆంక్షలు పెట్టి మరింత ఇబ్బందులపాలు చేయడం జగన్ రెడ్డికే చెల్లిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పద్దతి మార్చుకోవాలని... మొక్కజొన్న రైతుకు గిట్టుబాటు ధర కల్పించేలా పంట కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేసారు. 

click me!