
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ కి తెలుగుదేశం పార్టీ మరో లేఖ రాసింది. ఏపీలోని ఫైబర్ నెట్ పై చేసింది. టీవీ ఆన్ చేయగానే సీఎం వైఎస్ జగన్ ఫోటో వస్తుందని ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది.
ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని దీని మీద చర్య తీసుకోవాలని టీడీపీ కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్ లు ఉన్నాయని లేఖలో టీడీపీ పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీవీలో సీఎం ఫోటో రావడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
డిఫాల్ట్ కింద ఫైబర్ నెట్ లో సీఎం ఫోటో వచ్చేలా ఏర్పాటు చేశారని ఎస్ఈసీకి తెలిసింది. వెంటనే ఫైబర్ నెట్ లో సీఎం ఫోటో రాకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎన్నికల కమిషన్ ను కోరింది.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులపై రాసిన లేఖలో ఈ మేరకు పరిషత్ ఎన్నికల గురించి ప్రస్తావించారు.
వాహనాలకు పరిషత్ ఎన్నికలదాకా తటస్థ రంగులే వేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే వైసీపీ రంగులు పునరుద్ధరించవద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
అంతేకాదు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యేదాకా తటస్థ రంగులే కొనసాగించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జోరందుకున్న సంగతి తెలిసిందే.