నంద్యాల విషయంలో ‘దేశం’లో ఆందోళన

Published : Jul 03, 2017, 07:22 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
నంద్యాల విషయంలో ‘దేశం’లో ఆందోళన

సారాంశం

నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ఎక్కడేం జరుగుతోందో చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు రోజువారీ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో అభ్యర్ధికి ఎదురవుతున్న చేదు అనుభవాలను కూడా పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారట.

తెలుగుదేశపార్టీ అధిష్టానంలో నంద్యాల అనుభవాలు ఆందోళనలు రేపుతున్నాయి. ప్రచారంలో ‘భూమా’కు ఎదురవుతున్న చేదు అనుభవాల విషయంలో ఏం చేయాలో పాలుపోవటం లేదట. నంద్యాల ఉపఎన్నికలో ప్రచారం చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డికి షాకులు మీద షాకులు తగులుతున్నా సంగతి తెలిసిందే కదా.  టిడిపిలో సీనియర్ నేతలు కలిసిరాకపోవటం పక్కనబెడితే ప్రజలు మాత్రం ఎదురుతిరుగుతున్నారు.

ప్రచారంలో భాగంగా ఓట్లు అడగటానికి వచ్చిన బ్రహ్మానందరెడ్డికి ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. టిడిపికి ఎందుకు ఓట్లేయాలని నిలదీస్తున్నారు. దాంతో భూమాకు, అనుచరులకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావటం లేదు. ఎక్కడ చూసినా రేషన్ రావటం లేదని, ఫించన్ అందటం లేదని మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ జనాలు నిలదీస్తుండటంతో మిగిలినవారిని ఓట్లు అడగకుండానే బ్రహ్మానందరెడ్డి తదితరులు మెల్లిగా జారుకుంటున్నారు.

కొందరు ఓటర్లైతే నేరుగా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేయమని చెబుతూనే తమ ఓట్లు శిల్పా మోహన్ రెడ్డికే వేస్తామని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. దాంతో వీళ్ళకేమైందని టిడిపి నేతలు వాపోతున్నారు. ఇప్పటికైతే అభ్యర్ధిమాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఇంకా మంత్రి, తదితరులు పూర్తిస్ధాయి ప్రచారంలోకి దిగలేదు. ఇక తాము కూడా ప్రచారంలోకి దిగితే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందోనని ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.

నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ఎక్కడేం జరుగుతోందో చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు రోజువారీ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో అభ్యర్ధికి ఎదురవుతున్న చేదు అనుభవాలను కూడా పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారట. దాంతో పార్టీ యంత్రాగం మొత్తాన్ని త్వరలో రంగంలోకి దిగమని చంద్రబాబు నేతలకు పురమాయించారు. మొత్తం మీద భూమా కుటుంబానికున్న ప్రతిష్ట ఈ ఉపఎన్నికతో తేలిపోతుందనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu