
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి దాడికి యత్నించిన పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లకు లేఖల ద్వారా ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు గ్రామ కమిటీల్లో నేతలు తీర్మానం చేసి సంతకాలు చేసిన లేఖలను పోస్టు ద్వారా పంపినట్టు పార్టీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఏపీలో ఎస్సీలపై దమనకాండ, ఆదివాసీల సంపద దోపిడీ, మహిళలపై అరాచకాలు, బీసీ, మైనార్టీలపై వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ నేతలు ఆరోపించారు.
ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు గృహ నిర్బంధాలు చేయిస్తూ భౌతిక దాడులు, మానసిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు. సెప్టెంబరు 17న ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్, అతని అనుచరుల దాడితో రాక్షస, ఆటవిక పాలన పరాకాష్టకు చేరిందని ధ్వజమెత్తారు. దాడికి ముఖ్యమంత్రి జగన్, డీజీపీల మద్దతు ఉందని జోగి రమేశ్ బహిరంగంగానే చెప్పినందున డీజీపీని రీకాల్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం దర్శకత్వంలోనే ఈ దాడి జరగటం ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా వారు అభివర్ణించారు.
Also Read:చంద్రబాబు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, అనుచరుల దాడి విజువల్స్
దాడిపై ఒకరోజు ముందే జోగి రమేశ్ ప్రకటించినా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోకపోగా వత్తాసు పలికారని ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై ఎలాంటి నిరసన కార్యక్రమాలు తలపెట్టినా ముందుగానే గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయటంతో పాటు ఎదురు కేసులు పెడుతున్నారని తప్పుబట్టారు. అధికార పార్టీ నేతల హింసాత్మక దాడులపై ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వ్యవస్థకే మాయని మచ్చలాంటిదని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేయటం, నేతలను బెదిరించటం వంటి హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదని నేతలు స్పష్టం చేశారు. దాడికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని, ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలను పునరుద్ధరించాలని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లకు విజ్ఞప్తి చేశారు.