‘దేశం’లో కరపత్రాల కలకలం

First Published Oct 10, 2017, 1:33 PM IST
Highlights
  • టీడీపీ నేతలను కలవరపెడుతున్న కరపత్రాలు
  • టీడీపీ నేతల అవినీతి అక్రమాలను తెలియజేస్తూ కరపత్రాల పంపిణీ
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని

ఒక ఆకాశరామన్న రాసిన కరపత్రం టీడీపీ నేతల్లో కలవరం పెడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమ అమలు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంటింటికీ తిరిగి ప్రచారాలు చేపడుతున్నారు. అయితే.. మరో వైపు ఆ నేతలు చేస్తున్న అక్రమాలను తెలియజేస్తూ ఆకాశరామన్న రాసిన కరపత్రాలు ప్రత్యక్షమౌతున్నాయి.

అసలేం జరిగిందంటే.. ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో సోమవారం ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా స్థానిక పెట్రోల్‌బంక్‌ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇదే సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు వారికి లభించిన కరపత్రాలకు ఎమ్మెల్యే చింతమనేనికి చూపించారు.  ఆదివారం రాత్రి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ కరపత్రాలను పంపిణీ చేసినట్లు వారు చెబుతున్నారు. ఆ కరపత్రం చూసి.. ఎమ్మెల్యే చింతమనేని, ఎంపీ మాగంటి అవాక్కయ్యారు.

 ఇంతకీ ఆ కరపత్రంలో ఏముందంటే.. ‘‘గ్రామంలోని సుమారు 450 ఎకరాల చెరువులో అక్రమంగా చేపల సాగు చేస్తూ టీడీపీ నాయకులు దొంగచాటుగా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. పాత మరుగుదొడ్లకు సున్నం కొట్టడంతో పాటు ఒకే ఇంట్లో రెండు లేదా మూడు దొడ్లు నిర్మించామంటూ లక్షల రూపాయలు మింగేశారు. ఉపాధిహామీ పథకం పనుల్లో తప్పుడు మస్టర్లు వేసి టీడీపీ నాయకులు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు కాజేశారు. రూ.1.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి.’’ అంటూ ఆ కరపత్రంలో రాశారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత కల్గిన పౌరుడిగా ఈ పత్రాన్ని పంపిణీ చేస్తున్నట్టు కరపత్రంలో ఉంది. ఆ కరపత్రాన్ని చదివిన చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాసిన వాడికి దమ్ముంటే అభివృద్ధి పనులపై బహిరంగ చర్చలకు రావాలని సవాల్‌ విసిరారు.

click me!