
ఏపీ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. దీంతో పొత్తుల వ్యవహారం ఆసక్తిగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పైనే అందరి దృష్టి ఉంది. ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు అన్ని పార్టీలు ఉవ్విళూరుతున్నాయి. అయితే.. పొత్తుల వ్యవహారం పక్కన పెడితే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు జనసేన వైపే చూస్తున్నారట. ఒక వైపు ఆకర్ష్ పేరిట వైసీపీ నేతలను చంద్రబాబు టీడీపీలోకి లక్కొంటుంటే.. ఆ పార్టీ నేతలు జనసేనలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి.
టీడీపీలో చాలా మంది అసంతృప్త నేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచినప్పటికీ.. కొందరు ఎమ్మెల్యేలను రానున్న ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశాలు అనుమానంగా ఉన్నాయి.దీంతో ఆ నేతలంతా జనసేన వైపు అడుగులు వేయాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో బెజవాడ రాజకీయాల్లో ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. తనకు ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో చోటు దక్కుతుందని బోండా భావించారు. మంత్రి వర్గంలో చోటు కల్పించకపోగా.. పార్టీలోనూ ఆయనకు ప్రాధాన్యత తగ్గిపోయింది.
వరుసగా తనకు తగులుతున్న షాక్‌లతో పార్టీ అధిష్టానంపై బోండా ఉమ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. కేబినెట్లో చోటు దక్కలేదని.. ‘ చంద్రబాబు.. కాపుల గొంతు కోస్తున్నారు’ అంటూ బొండా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పార్టీలో నెమ్మదిగా ప్రాధాన్యతని కూడా కోల్పోయారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి టిక్కెట్ దక్కే విషయంలోను ఆయనకు అనుమానాలున్నాయట. ఈ నేపథ్యంలో ఆయన రానున్న ఎన్నికల్లో జనసేన తరపు నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు టాక్.
బొండా ఉమతోపాటు చాలా మంది కాపు నేతలు ఈ విధంగానే ఆలోచిస్తున్నారట. 60శాతం మంది కొత్తవారిని, 40శాతం మంది పాత వారిని ఎన్నికల బరిలో దింపుతానని పవన్ ఎప్పుడో చెప్పాడు. దీంతో ఆ 40శాతం కోటాలో జనసేన టికెట్ దక్కించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారట.